తొడకొట్టుడుపై బాలయ్య పట్టుబట్టి..

తెలుగు సినిమాల్లో తొడ కొట్టే సీన్ అనగానే నందమూరి బాలకృష్ణే గుర్తుకొస్తాడు. ఆ తరహా సన్నివేశాలకు క్రేజ్ తీసుకొచ్చింది బాలయ్యే. సమరసింహారెడ్డి.. నరసింహనాయుడు లాంటి సినిమాల్లో తొడకొట్టుడు సీన్లు ఏ రేంజిలో పేలాయో తెలిసిన సంగతే. ఐతే అలాంటి ఫ్యాక్షన్ సినిమాల్లో తొడకొట్టుడు సీన్లు బాగానే ఉంటాయి కానీ.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి సినిమాలో ఇలాంటి సన్నివేశం ఏమాత్రం సూటవుతుందో అని సందేహాలు కలగడం ఖాయం. అందులోనూ క్రిష్ లాంటి దర్శకుడు ఇలాంటి సినిమాలో అలాంటి సన్నివేశం పెడతారని ఎవరూ అనుకోలేదు. కానీ క్రిష్ తొడకొట్టుడు సీన్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ సన్నివేశం సినిమాలోనూ బాగా పేలింది. ఈ తొడ కొట్టుడు సన్నివేశం వెనుక ఓ ఆసక్తికర కథను రాజమౌళితో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిష్ పంచుకున్నాడు.

‘‘నన్నందరూ క్లాస్ డైరెక్టర్ క్లాస్ డైరెక్టర్ అని.. మాస్ సీన్స్ తీయలేడని అంటే నాకు ఏదోలా అనిపించేది. నేను ఎంచుకున్న కథలకు తగ్గట్లు వెళ్లిపోయాను తప్పితే మాస్ సీన్స్ డీల్ చేయలేనని కాదు. అందుకే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో మాస్ ప్రేక్షకుల్ని అలరించే సన్నివేశాలు రాసుకున్నాను. ఓ సీన్లో తొడ కొట్టే సీన్ కూడా పెట్టాం. ఐతే బాలయ్య గారు ఈ సీన్ చేయడానికి సందేహించారు. ఇలాంటి సినిమాలో తొడకొడితే ఓకేనా అన్నారు. అభిమానులకు నచ్చుతుంది కానీ.. మీకు ఒకేనా అని ఒకటికి రెండుసార్లు అడిగారు. సార్.. నేనే అడుగుతున్నా కొట్టండి సార్ అన్నాను. తర్వాత ఇంకో సీన్లో యుద్ధ రంగంలో దూసుకెళ్తూ ఒకటికి రెండుసార్లు తొడలు కొట్టే సీన్ చేశాం. బాలయ్య గారు ఆ సీన్ చాలా బాగా చేశారు కానీ.. నాకే రెండు తొడలు కొట్టే సీన్ ఏదోలా అనిపించింది. ఎడిటింగ్ సందర్భంగా చూసుకుని రెండో తొడ కొట్టే షాట్ లేపేశాను. ఐతే బాలయ్య గారు రష్ చూసుకుని నాకు ఫోన్ చేశారు. రెండో తొడ కొట్టే సీన్ కూడా పెట్టమన్నారు. నేను బాగోదేమో అంటే.. ఈ ఒక్క విషయంలో తన మాట వినమని.. ప్రేక్షకులకు ఇది నచ్చుతుందని చెప్పారు. థియేటర్లో ఈ సన్నివేశానికి అద్భుతమైన స్పందన వస్తోంది. స్వయంగా నేనే ఈ సీన్ చూసి ఈల వేశాను. బాలయ్య గారి జడ్జిమెంట్ నిజమైంది’’ అని క్రిష్ వెల్లడించాడు.