సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇంత ఘోరమా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనుకోని అనుభవం ఎదురైందని చెబుతున్నారు. తన క్యాంప్ ఆఫీసులో పని చేస్తున్న అధికారి తీరు గురించి ఒక మహిళా అధికారి నేరుగా సీఎం కేసీఆర్ కే చెప్పేశారన్న సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఎం క్యాంప్ కార్యాలయం ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న పోలీసు అధికారి చేష్టలపై ఒక మహిళా ఉద్యోగి కేసీఆర్ కు నేరుగా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

తన క్యాంప్ కార్యాలయంలో ఒక మహిళను వేధింపులకు గురి చేసిన వైనం గురించి తెలుసుకున్న ఆయన విస్మయాన్ని వ్యక్తం చేయటంతో పాటు.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. డీఎస్పీ హోదాలో ఉన్న సదరు అధికారిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లుగా చెబుతున్నారు. సీఎమ్మే స్వయంగా సీన్లోకి వచ్చిన తర్వాత.. చర్యలు వాయు వేగంతో జరిగిపోయినట్లు తెలుస్తోంది.

మహిళా ఉద్యోగిని వేధిస్తున్న సదరు పోలీసు అధికారిని సీఎం కార్యాలయం నుంచి వెంటనే బదిలీ చేయటమే కాదు.. విచారణ షురూ చేసినట్లుగా తెలుస్తోంది. సీఎమ్మే కే నేరుగా కంప్లైంట్ చేసిన సదరు మహిళా ఉద్యోగి..పోలీసులకు మాత్రం ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకపోవటం గమనార్హం. సీఎం దృష్టికి విషయం వెళ్లిన తర్వాత కంప్లైంట్ అవసరం ఏమిటని అనుకొని ఉండొచ్చు. ఆమె అంచనాకు తగ్గట్లే.. సదరు అధికారిపై ఇప్పుడు నిఘా విభాగాలు ఫోకస్ పెంచి.. అతడికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏమైనా..ముఖ్యమంత్రి కార్యాలయంలోనే మహిళలకు వేధింపు వ్యవహారం చోటు చేసుకోవటం.. బాధితురాలు ధైర్యంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన వైనంపై ఆసక్తికర చర్చ సీఎంవో జరుగుతున్నట్లు సమాచారం.