నారా రోహిత్ గురించి చర్చకొచ్చిన ప్రతిసారి నారా లోకేశ్ గుర్తుకొస్తారు. వాళ్లద్దరిని పోల్చుకుంటూ మాట్లాడాల్సిన తప్పని పరిస్థితి. ఎందుకంటే ఇద్దరూ అన్నదమ్ముల పిల్లలు కాబట్టి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి కుమారుడే రోహిత్. రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ఆ రంగంలోకి వచ్చేందుకు రోహిత్ ఆసక్తి కనబరచలేదు.
రోహిత్ సినీరంగ ప్రవేశం చేశాడు. చిత్రపరిశ్రమలో టాలెంట్ చూపాలనుకున్నాడు. అడపాదడపా సినిమాల్లో హీరోగా నటించాడు. వివాదరహితుడిగా పేరు పొందాడు. అంతేకాదు నారా వంశంలో లేని దాతృత్వ గుణం అతనిలో ఉందని చాటుకున్నాడు. ఇటీవల కరోనా బాధితులను ఆదుకునేందుకు రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసును ప్రదర్శించాడు. కానీ 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన రోహిత్ పెదనాన్న చంద్రబాబు కుటుంబం కేవలం రూ.10 లక్షలతో సరిపెట్టి తన పిసినారి తనాన్ని ప్రదర్శించింది.
నారా రోహిత్‌పై యంగ్ హీరో శ్రీవిష్ణు వెల్లడించిన అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సహజ నటుడిగా పేరొందిన శ్రీవిష్ణు, నారా రోహిత్ మంచి స్నేహితులు. తన ఫ్రెండ్ గురించి ఓ ఇంటర్వ్యూలో శ్రీవిష్ణు ఏం చెప్పాడో చదవండి…
‘నారా రోహిత్ ఫ్రెండ్‌గా దొరకడం నా అదృష్టం. ఇప్పటి వరకు ఎలాంటి మనస్పర్థలూ రాలేదు. నా నుంచి కాల్ రాకపోతే, రోహితే ఫోన్ చేసి విషయాలు తెలుసుకుంటాడు. నన్ను దృష్టిలో పెట్టుకుని అతను షాపింగ్ చేస్తాడు. నా గురించి అతను పట్టించుకున్నంతగా మరెవరూ పట్టించుకోరు. అందుకే అలాంటి స్నేహితుడు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని’ అని శ్రీవిష్ణు తెలిపాడు.
మరి నారా రోహిత్ అన్న, టీడీపీ యువనేత నారా లోకేశ్ గురించి ఇలాంటి ప్రశంసాపూర్వకమైన మాట ఒక్కరంటే ఒక్క టీడీపీ నాయకుడైనా చెప్పారా? అసలు లోకేశ్ గురించి ఇలాంటి అభిప్రాయాన్ని టీడీపీ నేతల నుంచి ఆశించవచ్చా? ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి లోకేశ్ విధానాలే కారణమనే విమర్శలు బలంగా వినిస్తున్నాయి.
అందుకే ఈ అనుమానం రావడం. అయితే అడిగితే పొగిడే వారు ఏం స్నేహితులు? ఇప్పటి వరకు తనకు ఫలానా వ్యక్తి మంచి స్నేహితుడని లోకేశ్ చెప్పడం కానీ, లేదా లోకేశ్ గురించి అభిప్రాయపడ్డ వారు ఇంత వరకూ లేరంటే ఆశ్చర్యమే.