‘లూసీఫర్‌’ మెగా రీమేక్‌పై మరింత స్పష్టత

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన ‘లూసీఫర్‌’ సూపర్‌ హిట్‌ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమాను తెలుగు వారు కూడా చాలా మందే చూసి ఉంటారు. సబ్‌ టైటిల్స్‌ తో ఓటీటీలో తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే లూసీఫర్‌ ను చూసినా కూడా రీమేక్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లూసీఫర్‌ రీమేక్‌ గురించి చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. చరణ్‌ ఈ రీమేక్‌ రైట్స్‌ ను దక్కించుకున్నాడు అంటూ ప్రచారం జరిగింది. కాని ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ను తీసుకున్నది రామ్‌ చరణ్‌ కాదు ప్రముఖ నిర్మాత అయిన ఎన్వీ ప్రసాద్‌.

మెగా ఫ్యామిలీకి సన్నిహితుడిగా పేరున్న నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ బ్యానర్‌ లో చిరంజీవి ఒక సినిమా చేయాల్సి ఉంది. అది ఈ రీమేక్‌ రూపంలో చేయబోతున్నారట. లూసీఫర్‌ కు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో 1.5 కోట్ల రూపాయలతో ఎన్వీ ప్రసాద్‌ రీమేక్‌ రైట్స్‌ ను కొనుగోలు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. మలయాళ చిత్రం రీమేక్‌ రైట్స్‌ కు ఇంత భారీగా పెట్టడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. మెగాస్టార్‌ కు బాగా సూట్‌ అయ్యే సబ్జెక్ట్‌ అనే ఉద్దేశ్యంతో కోటిన్నర వరకు పెట్టారట.

ఇక లూసీఫర్‌ రీమేక్‌ రైట్స్‌ బాధ్యతలు సాహో చిత్ర దర్శకుడు సుజీత్‌ చేతిలో పెట్టారు. ఇప్పటికే సుజీత్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ లో తలమునకలై ఉన్నాడు. చిరంజీవి సూచన మేరకు ఒరిజినల్‌ వర్షన్‌ లో చాలా మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ రచయితలు ప్రస్తుతం లూసీఫర్‌ తెలుగు వర్షన్‌ కోసం స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నారు.

చిరంజీవి తన సినిమాల స్క్రిప్ట్‌ విషయంలో పరుచూరి బ్రదర్స్‌ ఇన్వాల్వ్‌ మెంట్‌ తప్పనిసరిగా ఉండేలా చూస్తాడు. అలాగే ఈ స్క్రిప్ట్‌ ఫినిషింగ్‌ కూడా పరుచూరి బ్రదర్స్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆచార్య చిత్రం షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత అంటే ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాదిలో ఈ రీమేక్‌ పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.