మహాత్మా మన్నించు.. నువ్వు మళ్ళీ పుట్టేశావంటున్నారు.!

గాంధీ మహాత్ముడు మళ్ళీ పుడితే.! ముందుగా నీది ఏ కులం.? అని ప్రశ్నించే లోకమిది. నీది ఏ మతం.? అని నిలదీసే రోజులివి. నీది ఏ ప్రాంతం.? నీది ఏ జాతి.? అని ప్రశ్నల పరంపర కొనసాగుతూనే వుంటుంది. రోజులు అలా తగలడ్డాయ్‌.! మహాత్మా గాంధీ మాత్రమే కాదు.. ఆ దేవుడే దిగివచ్చినా.. పై ప్రశ్నల నుంచి తప్పించుకోలేరు.!

కుల, మత, ప్రాంత, వర్గ, జాతి రాజకీయాలనే బురదలో కొట్టుమిట్టాడుతున్న రాజకీయ నాయకులు, తమ అధినేతల మెప్పు కోసం ఏకంగా ‘మహాత్ముడే తమ అధినేత రూపంలో మళ్ళీ పుట్టేశాడు’ అంటూ కారు కూతలు కూసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన నేత ఒకరు, ‘వైఎస్‌ జగన్‌ రూపంలో మహాత్ముడు మళ్ళీ పుట్టేశాడు..’ అంటూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

నిజానికి, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కూడా ఈ తరహా ‘పొగడ్తల్ని’ స్వీకరించే పరిస్థితిలో వుండరేమో. ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలేంటే.. తాము చేస్తున్న రాజకీయాలేంటో ప్రతి రాజకీయ నాయకుడికీ తెలుసు. మహనీయులతో తమను తాము పోల్చుకోవాలని ఎవరూ అనుకోరు. ఒకవేళ అలా అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

మహాత్ముడి ఆశయాలేంటి.? మహాత్ముడు దేశానికి చేసిన సేవ ఏంటి.? ఇప్పుడున్న రాజకీయ నాయకులు.. ప్రజల్ని దోచుకుంటున్న తీరు ఏమిటి.? ప్రతి రాజకీయ నాయకుడికీ ఈ విషయాలన్నీ బాగా తెలుసు. ఎన్నికల్లో పోటీ చేయడానికి కోట్లు ఖర్చు చేయాల్సిందే ఎవరైనా. ప్రజల్ని వంచించడం, కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో రాజకీయాలు చేసి, రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవాల్సిన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఈ తరం రాజకీయ నాయకులు.

ఇంతటి ఘనకార్యాలు వెలగబెడుతున్న రాజకీయ నాయకులు, మహాత్ముడి జయంతి రోజు, ‘మహాత్ముడు మళ్ళీ పుట్టేశాడు..’ అంటూ వ్యాఖ్యానించడమంటే నవ్వాలో ఏడవాలో తెలియని దుస్థితి ప్రజలది.