ప్రభాస్.. పూజా హెగ్డేల రాధేశ్యామ్ విడుదలకు సిద్దం అయ్యింది. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాధేశ్యామ్ గురించి రోజుకో వార్త అన్నట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలు సినిమా స్థాయిని అంతకంతకు పెంచుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వార్త సినిమా ను గురించి మరింత హైప్ క్రియేట్ చేసేలా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆ వార్త ఏంటీ అంటే.. రాధేశ్యామ్ సినిమా కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. తెలుగు వర్షన్ రాధేశ్యామ్ కోసం మహేష్ బాబు తన వాయిస్ ను ఇవ్వబోతున్నాడని.. హిందీ వర్షన్ కోసం అమితాబచ్చన్ తో వాయిస్ ఇప్పటించారని తెలుస్తోంది. అమితాబచ్చన్ వాయిస్ తో హిందీ రాధేశ్యామ్ స్థాయి ఎలా అయితే పెరిగిందో అలాగే మహేష్ వాయిస్ తో తెలుగు రాధేశ్యామ్ స్థాయి పెరుగుతుందని మేకర్స్ విశ్వసిస్తున్నారు.
ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో భేటీ కోసం మహేష్ బాబు మరియు ప్రభాస్ లు హాజరు అయిన విషయం తెల్సిందే. అప్పటి నుండి వీరి కాంబో గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. అది ఇంత త్వరగా ఇలా వర్కౌట్ అవుతుందని ఏ ఒక్కరు ఊహించలేదు. రాధేశ్యామ్ సినిమా ఆరంభంలోనే ప్రభాస్ పాత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే వాయిస్ ఓవర్ ను మహేష్ బాబు ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.
సినిమా ఆరంభంలోనే కాకుండా మద్య మద్యలో మరియు చివర్లో కూడా మహేష్ బాబు వాయిస్ వినిపిస్తుందని అంటున్నారు. ప్రభాస్ సినిమా కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అనే వార్త తెలుగు ప్రేక్షకులకు మరియు ఇండస్ట్రీ వర్గాల వారికి మీడియా సర్కిల్స్ వారికి కూడా వినడానికే చాలా వీనుల వింధుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. అలాంటిది సినిమాలో మహేష్ బాబు వాయిస్ వింటే ప్రభాస్ అభిమానులు సర్ ప్రైజ్ అవ్వడం ఖాయం.
మహేష్ బాబు ఈమద్య కాలంలో తన సినిమాల కోసమే కాకుండా ఇతర సినిమాల కోసం కూడా టైమ్ కేటాయిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా తన సన్నిహితుల సినిమాల కోసం ఫ్రీ పబ్లిసిటీ చేయడం మొదలుకుని పలు కార్యక్రమాల్లో మహేష్ బాబు పాల్గొంటున్నాడు. సినిమా వేడుకల్లో మొదలుకుని పలు సందర్బాల్లో ఆయన పాల్గొంటూ ఉన్నాడు. కనుక రాధేశ్యామ్ కు వాయిస్ ఓవర్ ఇచ్చాడు అంటే అనుమానం ఏమీ అక్కర్లేదు.
ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో ఒక జ్యోతిష్యుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది. సినిమా లో ప్రభాస్ పాత్రను పరిచయం చేయడం కోసం ఒక స్టార్ వాయిస్ అయితే బాగుంటుందని మేకర్స్ భావించారు. అందుకు మహేష్ బాబు ఓకే చెప్పడం జరిగిందట. తమిళంలో కూడా ఒక స్టార్ హీరోతోనే ఈ వాయిస్ ఓవర్ చెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్ది అంచనాలు పెరిగి పోతూనే ఉన్నాయి.