బాలయ్యని మహేష్ ఫాలో అయిపోయాడా?

నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు స్టార్ హీరోలు కూడా సినిమా చూస్తున్నా.. బాలయ్య డైలాగ్ వినిపించినా `జై బాలయ్య` అంటుంటారు. దీంతో `జై బాలయ్య` అనే పదం చాలా పాపులర్ గా మారిపోయింది. దీన్ని గమనించిన స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన తాజా చిత్రం `అఖండ`లో ఈ స్లోగన్ ని పాటగా మార్చేసి `యా యా యా జై బాలయ్య` అంటూ సూపర్ హిట్ చేసేశాడు. `అఖండ`లో బాలయ్య ప్రగ్యా జైస్వాల్ పై చిత్రీకరించిన ఈ పాట సినిమాకు ఓ హైలైట్ గా నిలిచింది.

ఇప్పడు ఇదే తరహాలో హీరో పేరుని యూజ్ చేస్తూ పాటలు చేయడం వాటిని స్టార్ హీరోలపై ప్రత్యేకంగా చిత్రీకరించడం ఓ ట్రెండ్ గా మారిపోయింది. ఇప్పడు బాలయ్య తరహాలోనూ సూపర్ స్టార్ మహేష్ బాబుపై కూడా ఓ మాస్ బీట్ ని రెడీ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. ఈ చిత్రం కోసం మహేష్ బాబు పై ఆసక్తికరంగా సాగే ఓ పాటని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. `మా మా మా మహేషు`.. అంటూ అచ్చం `జై బాలయ్య` సాంగ్ తరహాలోనే ఓ పాటను షూట్ చేస్తున్నారు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కోసం మహేష్ – కీర్తి సురేష్ ల పై తాజా పాటని రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి బాలయ్య అక్కినేని నాగార్జున వంటి హీరోల చిత్రాల్లో వాళ్ల పేర్లతో సాగే పాటలు ఇప్పడికే హ్యూజ్ హిట్ అయ్యాయి. ఫ్యాన్స్ కి జోష్ ని అందించాయి. ఇదే తరహాలో తొలిసారి మహేష్ బాబు పై ఆయన పేరు ప్రతిధ్వనించేలా తాజా పాటని చిత్రీకరిస్తుండటం విశేషం.

`సరిలేరు నీకెవ్వరు` మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. యంగ్ డైరెక్టర్ పరశురామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నఈ మూవీ మే 12న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని రెండు లిరికల్ వీడియోలు ఇటీవలే విడుదలై రికార్డు వ్యూస్ ని సాధించాయి. `కళావతి…`.. ఎవ్రీ పెన్నీ.. అంటూ సాగే సాంగ్స్ తరువాత తాజాగా మహేష్ బాబు పేరుతో సాగే గీతాన్ని విడుదల చేస్తారని తెలుస్తోంది.

పోకిరి వైబ్స్ కనిపిస్తున్న ఈ మూవీ కోసం స్పెయిన్ లో చిత్రీకరించిన కీలక ఘట్టాలు దుబాయ్ నేపథ్యంలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. సముద్రఖని వెన్నెల కిషోర్ సుబ్బరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ కెమెరా ఆర్. మది ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్.