కరోనా కారణంగా సైలంట్ గా వున్న టాలీవుడ్ లో నిన్నటికి నిన్న ఓ వార్త చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. మహేష్ బాబుతో స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నారని, అది కూడా హారిక హాసినికి కాకుండా బయట బ్యానర్ కు చేస్తారన్నది ఆ వార్త సారాశం. ఈ విషయం వెంటనే హారిక హాసిని తో సంబంధాలు వున్నవారి దృష్టికి తీసుకెళ్తే గాలి వార్త అని కొట్టిపారేశారు. ఎన్టీఆర్ సినిమా ఆ తరువాత రామ్ చరణ్ సినిమా, ఆపైన పవన్ కళ్యాణ్ సినిమా ఈ మూడూ ప్లానింగ్ లో వుండగా, అవన్నీ ఏమైపోవాలని ఆ వర్గాల ప్రశ్నించాయి.
ఈ మధ్యనే మైత్రీ మూవీస్ కు ఇవ్వాల్సిన అడ్వాన్స్ కు, వడ్డీలు కలిపి 11 కోట్లు త్రివిక్రమ్ తీర్చేసారు. మైత్రీకి అడ్వాన్స్ వెనక్కు ఇవ్వడానికి రెండు కారణాలు. ఒకటి బయట బ్యానర్ కు సినిమా చేసే ఆలోచన తివిక్రమ్ కు లేకపోవడం. రెండు మహేష్ బాబుతోనే మైత్రీకి సినిమా చేయాల్సి వుండడం. మరి అలాంటి నేపథ్యంలో రెండున్నర కోట్ల కోసం 11 కోట్లు ఇచ్చిన త్రివిక్రమ్ ఇప్పుడు మహేష్ తో సినిమా వేరేవాళ్లకు ఎందుకు చేస్తారా? అలా చేసే ఆలోచన వుంటే మైత్రీ కే చేస్తే, కనీసం ఎనిమిది కోట్లు మిగుల్తాయి కదా?
పోనీ తివిక్రమ్-మహేష్ సినిమా హారిక హాసిని యే నిర్మిస్తుందేమో అనుకుంటే, ఆ ఇద్దరి మద్య సంబంధాలు అంతగా లేవని చిరకాలంగా వినిపిస్తూ వుంది. ఎప్పడయితే మహేష్ దగ్గర నుంచి హారిక హాసిని చినబాబు అడ్వాన్స్ వెనక్కు తెచ్చుకున్నారో అప్పటి నుంచి వారి మధ్య సంబంధాలు లేవని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. పైగా అల వైకుంఠపురములో సినిమా టైమ్ లో గ్యాప్ మరింత పెరిగిందని టాక్. కలెక్షన్ల విషయంలో హారిక హాసిని గిల్డ్ లోనో, చాంబర్ లోనో ఏవి ఒరిజినల్ అనేది తేల్చడానికి పంచాయతీ పెట్టే ఆలోచన చేసిందని అప్పట్లో వార్తలు వినిపించాయి.
ఇదిలా వుంటే మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ ను ఎలాగైనా సాధించాలన్నది చిరకాలంగా నమ్రత కోరిక. ఆ దిశగా ఆమె చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా సరిలేరు నీకెవ్వరు సినిమా నిర్మించిన అనిల్ సుంకరకు మరో సినిమా మహేష్ చేస్తారని వార్తలు వున్నాయి. ఎందుకంటే ఆ సినిమా అన్ని కోట్ల కలెక్షన్లు సాధించినా, నిర్మాతగా మాత్రం అనిల్ సుంకరకు పెద్దగా మిగలలేదని, లేదా కొద్దిగా డెఫిసిట్ కూడా అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తూనే వుంది.
అందుకే మళ్లీ అనిల్ సుంకర-అనిల్ రావిపూడి కాంబోనే సెట్ చేయడానికి మహేష్ చూస్తున్నారని కూడా వార్తలు వున్నాయి. అయితే అనిల్ రావిపూడి మళ్లీ అదే బ్యానర్ లో చేయడానికి అాంతగా ఇష్టపడడం లేదని కూడా తెలుస్తోంది. అందుకే త్రివిక్రమ్ సినిమా అనిల్ సుంకరకే అప్పగిస్తారని నిన్నటికి నిన్నవార్తలు వినిపించాయి.
కానీ ఈ వినిపిస్తున్న వార్తలు అన్నీ నమ్మశక్యంగా లేనివే. నిజంగా మహేష్-త్రివిక్రమ్ బయట బ్యానర్ కు సినిమా చేస్తే, అది ఇండస్ట్రీలో ఎనిమిదో వింతే.