కరోనా హాలీడేస్‌ను మహేష్‌ కోసం కేటాయించిన రాజమౌళి?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి సినిమా సినిమాకు ఏళ్లకు ఏళ్లు గ్యాప్‌ ఇస్తున్నాడు. ఈగ చిత్రం తర్వాత బాహుబలి సినిమాను విడుదల చేసేందుకు ఏకంగా అయిదు సంవత్సరాలు తీసుకున్నాడు. ఇక బాహుబలి తర్వాత రూపొందిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఏకంగా మూడు సంవత్సరాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తర్వాత మహేష్‌ బాబుతో సినిమా ఉంటుందని రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు. అయితే అది ఎప్పుడు ఏంటీ అనే విషయమై ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌ గత నాలుగు నెలలుగా లేకపోవడంతో రాజమౌళి ప్రస్తుతం తదుపరి చిత్రం కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడట. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వర్క్‌ ఏమీ లేకపోవడంతో తండ్రితో కలిసి మహేష్‌ బాబు సినిమాకు స్టోరీ లైన్‌ సిద్దం చేశాడట. త్వరలోనే స్క్రిప్ట్‌ ను కూడా మొదటి దశ పూర్తి చేసే అవకాశం ఉందంటున్నారు. మరో రెండు మూడు నెలల వరకు షూటింగ్స్‌కు వెళ్లే అవకాశం లేదు. ఆ కారణంగానే మహేష్‌ మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌ను ఈయన మొదలు పెట్టాడట.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అనుకున్న సమయం కంటే ఏకంగా ఏడాది పాటు ఆలస్యం అవ్వబోతుంది. ఆ కారణంగానే మహేష్‌ బాబు సినిమా ఆలస్యం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇప్పుడే స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడట. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలైన ఆరు నెలల్లోపే మహేష్‌ బాబు సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. అంటే 2022 ఆరంభంలో సినిమాను ప్రారంభించి 2023 చివరి వరకు సినిమాను విడుదల చేయాలని జక్కన్న భావిస్తున్నాడట.