బాలు కరోనాకు ఆమె కారణం.. మళ్లీ వైరల్‌ అవుతున్న గాయిని

ఆగస్టు 5వ తారీకున ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు స్వయంగా ఒక వీడియోను విడుదల చేసి తనకు కరోనా పాజిటివ్‌ అంటూ వచ్చింది. ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. నేను బాగానే ఉన్నాను. ఇంట్లోనే ఉండవచ్చు. కాని కుటుంబ సభ్యులు ఇతరుల కోరిక మేరకు ఆసుపత్రికి వచ్చాను అంటూ బాలు పేర్కొన్నారు. ఆ సమయంలో త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తానంటూ ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌ లో ఒక టీవీ ఛానెల్‌ నిర్వహించిన సంగీత కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా ఆయనకు కరోనా వచ్చింది. బాలు గారికి కరోనా రావడానికి కారణంగా సింగర్‌ మాళవిక అంటూ ఆ సమయంలో సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. ఆమె కరోనా ఉన్న విషయం దాచి కార్యక్రమంలో పాల్గొంది అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి.

తనపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు హర్ట్‌ అయిన మాళవిక సైబర్‌ క్రైమ్‌ ను ఆశ్రయించింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దం అయ్యింది. ఆ తర్వాత ఆ విషయం సర్దుమనిగింది. బాలు గారి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఆయన మృతి చెందడటంతో మళ్లీ ఆమెను నెటిజన్స్‌ టార్గెట్‌ చేశారు. బాలు మృతికి కారణం మాళవిక అంటూ నెటిజన్స్‌ చేస్తున్న ప్రచారంకు ఆమె కన్నీరు పెట్టుకుంది.

ఈ సందర్బంగా ఆమె స్పందిస్తూ.. బాలు గారికి కరోనా అని తెలిసిన వెంటనే మేము కూడా కరోనా పరీక్ష చేయించుకున్నాము. మాకు పాజిటివ్‌ వచ్చింది. గత రెండు నెలలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయంలో మీ అందరి మద్దతు మాకు బాలు గారి కుటుంబంకు కావాలి. కాని మీరు ఇలా విమర్శలు చేయడం చాలా బాధగా ఉంది. నాపై తప్పుడు ప్రచారం చేసే వారి గురించి సైబర్‌ క్రైమ్‌ వారికి ఇప్పటికే ఫిర్యాదు చేశాను. ఆ విషయాన్ని వారు చూసుకుంటారు అంటూ మాళవిక చెప్పుకొచ్చింది.