‘మా’ అసోసియేషన్ పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు.. ఎప్పుడూ లేనంతగా నువ్వా నేనా? అన్న రీతిలో సాగిన ఎన్నికల్లో ఎన్నో మలుపుల మధ్య.. ఎట్టకేలకు పోలింగ్ పూర్తి కావటం..సినీ హీరో కమ్ మోహన్ బాబు పుత్రరత్నమైన మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన ‘మా’ ఎన్నికల్ని చూసినప్పుడు పోలింగ్ వేళలో కాస్తంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నా.. ఫలితాల తర్వాత ప్యాచప్ అయిపోవటం.. ఏమైనా అరకొర మిగిలి ఉంటే.. రెండు రోజుల్లో సర్దుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఫలితాలు విడుదలై మూడో రోజుకు అంతా సర్దుబాటు జరిగిపోవటం.. అభినందనల సభలు జరుగుతుండటం తెలిసిందే.
కానీ.. ఈసారి అందుకు భిన్నంగా విష్ణుకు ఎలాంటి సభలు.. సమావేశాల్ని నిర్వహించలేదు. చివరకు సినీ ప్రముఖులు అన్న వారు సైతం సైలెంట్ గా ఉండిపోయారే తప్పించి.. ఎవరూకూడా నోరు విప్పి మంచు విష్ణుకు శుభాకాంక్షలు.. అభినందనలు అన్న మాట అన్నది లేదు. చివరకు మీడియా ముందుకు వచ్చిన మంచు విష్ణు.. తాను గెలిచిన విషయం టీవీల్లో చూసినంతనే తనకు మొదటి ఫోన్ చేశారని చెప్పటం గమనార్హం. అంటే.. మంచు ఫ్యామిలీకి ఫోన్ చేసిన తారక్.. శుభాకాంక్షలు తెలిపినట్లుగా మంచు విష్ణే ఓపెన్ అయ్యారు . ఇదంతా ఒక వ్యూహం ప్రకారం సాగిందన్న మాట వినిపిస్తోంది.
‘మా’ బరిలో నిలిచింది విష్ణునే అయినప్పటికీ.. తానే స్వయంగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందో.. అంతే తీవ్రతను మోహన్ బాబు ప్రదర్శించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఇంత ఆరాటం ఉన్నప్పుడు ఆయనే నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుండేది కదా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. క్రాస్ ఓటింగ్ కూడా భారీగా సాగిందన్న ప్రచారం సాగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత సినీ ప్రముఖుడు ఎవరూ ఓపెన్ గా మట్లాడకపోవటానికి కారణం.. బయటకు కనిపిస్తున్న ప్రశాంతత మొత్తం తుపాను ముందు వచ్చేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటివరకు జరిగిన ‘మా’ ఎన్నికల పోలింగ్ ఒక ఎత్తు.. ఇప్పుడు జరిగింది మరొక ఎత్తు కావటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ఎపిసోడ్ పూర్తిగా వ్యక్తిగతం కావటం.. గెలవటమే లక్ష్యంగా పెట్టుకొని గెలిచేసిన విష్ణు.. ఎన్నికల్లో విజయం సాధించొచ్చు కానీ.. సినిమా ఇండస్ట్రీలోని చాలామంది మనసుల్ని గెలుచుకోలేదన్న వాదన వినిపిస్తోంది. ఇదంతా ప్రకాశ్ రాజ్ తరఫున మెగా క్యాంప్ చేస్తున్న దుష్ప్రచారమని వాదిస్తున్నారు. ఏతావాతా సినీ ప్రముఖుల వరకు ఈ ఎన్నికలు.. కరవమంటే కప్పకు కోపం..విడువమంటే పాముకు కోపం అన్న సామెత చందంగా మారటంతో ఎవరికి వారు సైలెంట్ గా ఉన్నట్లు చెబుతున్నారు.