రజినీ రాజకీయాలపై మణిరత్నం కామెంట్

మామూలుగా మణిరత్నం తన సినిమాల గురించి మాట్లాడ్డమే అరుదైన విషయం. నా సినిమాలే మాట్లాడతాయి అన్నట్లుగా ఆయన మౌనం పాటిస్తుంటారు. ఐతే ఈ మధ్య మారుతున్న కాలానికి తగ్గట్లుగా ఆయన కూడా మారారు. తన సినిమాల గురించి కొంచెం మీడియా ముందు ఓపెన్ అవుతున్నారు. అలాగే వేరే అంశాల మీద కూడా మాట్లాడుతుున్నారు. తన కొత్త సినిమా ‘చెలియా’ ప్రమోషన్లలో భాగంగా ఆయన అనేక ఆసక్తర విషయాలపై మాట్లాడారు. అందులో రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం అంశం కూడా ఉండటం విశేషం. రజినీని రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేసే హక్కు ఎవ్వరికీ లేదంటున్నాడు మణిరత్నం.

‘‘రాజకీయాల్లోకి రావాలని రజినీపై ఎలా ఒత్తిడి తీసుకొస్తాం. పూర్తిగా అది ఆయన ఇష్టం. ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు ఆయనకుంది. ఆయన కూడా అందరిలాంటి మామూలు మనిషే. తన అభిప్రాయాలు తనకుంటాయి. సరైన సమయం వచ్చినపుడు.. తన వల్ల అవుతుంది అన్నపుడు ఆయన నిర్ణయం తీసుకుంటారేమో. ఆయనకు రహస్య అజెండాలున్నాయని నేనైతే అనుకోను. తనకు.. ప్రజలకు ఏది మంచిదనిపిస్తే అది చేస్తాడు రజినీ’’ అని మణిరత్నం అన్నాడు.

ఈ ఇంటర్వ్యూలో తన కొడుకు నందన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు మణి. ‘‘నా కొడుకు నందన్‌కు సినిమాలంటే ఆసక్తి లేదు. విద్యావేత్త కావాలనుకుంటున్నాడు. ప్రస్తుతం పీహెచ్డీ చేయాలనుకుంటున్నాడు. సినిమాల వైపు కన్నెత్తి చూడాలనుకోవట్లేదు. నేను చదివిన చదువుకు.. నేను చేస్తున్న పనికి సంబంధం లేదు. ఐతే నాకు చదువు మీద మంచి అభిప్రాయం ఉంది. మనకొక హోదా కల్పించేది చదువే’’ అని మణి అన్నాడు.