ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన మన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో మరో ట్విస్ట్. దివంగత ఆనంద గజపతిరాజుకు అసలైన వారసులం తామేనని.. ఈ విషయంలో సంచయితకు ఎలాంటి హక్కూ లేదంటూ ఆనంద గజపతిరాజు భార్య సుధా గజపతి, వారి కుమార్తె ఊర్మిళ పేర్కొంటున్నారు. మన్సాస్ ట్రస్టుకు సంబంధించి ఇటీవల పలు పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మన్సాస్ ట్రస్టు చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించి, ఆ స్థానంలో ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయితను చైర్ పర్సన్ గా నియమించారు. దీనిని అశోక్ గజపతిరాజు తీవ్రంగా తప్పుబట్టారు. ట్రస్టు ఆస్తులు కాజేయడానికే ఆమెను నియమించారంటూ టీడీపీ నేతలు కూడా పలు ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో ఆనందగజపతి రాజు రెండో భార్య సుధా గజపతి, వారి కుమార్తె ఊర్మిళ తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 1991లో ఉమ, ఆనందగజపతిరాజు విడాకులు తీసుకున్నారని, ఆ సమయంలోనే వారికి ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చేసి సెటిల్ మెంట్ చేశారని చెబుతున్నారు. ఈ మేరకు ఆయన రాసిన వీలునామా కూడా తమ దగ్గర ఉందని తెలిపారు. వారికి ఇవ్వాల్సినదంతా ఇచ్చేసినందున, తన ఆస్తులన్నింటికీ సుధ, ఊర్మిళే వారసులని స్పష్టంచేశారని పేర్కొన్నారు. సంచయితకు ఎలాంటి వారసత్వ హక్కులు లేవని స్పష్టంచేశారు. ఆమె తమపై తప్పుడు ఆరోపణలు చేయడంతోపాటు తప్పుడు కేసులు పెడుతోందని విమర్శించారు.
చెన్నైలో తమకు వారసత్వంగా వచ్చిన ఆస్తి విషయంపై సంచయిత విశాఖలో కేసు నమోదు చేయించారన్నారు. అసలు ఆమెకు ఎలాంటి హక్కులూ లేవన్నారు. తప్పుడు క్లెయిములు చేయడం సంచయితకు అలవాటేనని, అందరినీ మిస్ లీడ్ చేసే ట్రస్టు చైర్ పర్సన్ అయ్యారని ఆరోపించారు. ఈ విషయంలో తాము న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నట్టు ప్రకటించారు.
సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని, అది దొరికిన వెంటనే ఈ వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామని ఊర్మిళ తెలిపారు. మొత్తానికి మన్సాస్ ట్రస్టు వ్యవహారంలో అక్కాచెల్లెళ్ల మధ్య పోరు షూరూ అయిందని తెలుస్తోంది. అయితే, ఊర్మిళ పోరు కేవలం ఆస్తుల వ్యవహారం వరకు మాత్రమే పరిమితం అవుతుందా లేక మన్సాస్ ట్రస్టు చైర్మన్ గిరీపైనా కొనసాగుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.