ఆఖరికి ఆ హీరో దగ్గరకు మారుతి?

కత్తి పోయె ముల్లు వచ్చే ఢాం ఢాం ఢాం అన్నట్లుగా వుంది డైరక్టర్ మారుతి సినిమాకు హీరోల పేర్ల సంగతి. ప్రతిరోజూ పండగే సినిమా లాంటి సూపర్ హిట్ తరువాత సినిమా చేద్దాం అంటే హీరోలు ఎవ్వరూ ఖాళీ లేరు. అలా అని ఖాళీగా వుండడం మారుతికి అస్సలు అలవాటు లేదు. హీరో ల కోసం ఆరు నెలలు, ఏడాది ఖాళీగా వెయిట్ చేయడం అన్నది అస్సలు మారుతి డిక్షనరీ లో లేని సంగతి. మూడు నాలుగు సబ్జెక్ట్ లు రెడీగా పెట్టుకోవడం, ఏ హీరో దొరికితే వాళ్లకు తగిన దాంతో సినిమా లాగించేసి, మాంచి రెమ్యూనిరేషన్ అందుకోవడం అన్నది ఓ పాలసీగా కనిపిస్తుంది.

ప్రతి రోజూ పండగ తరువాత ముందుగా రామ్ పేరు వినిపించింది. ఆ తరువాత రవితేజ పేరు లైన్ లోకి వచ్చింది. అంతకన్నా ముందుగా నాని తదితర పేర్లు కూడా వినిపించాయి. సినిమా యువి/గీతా 2 కి కలిపి చేయాల్సి వుంది. దీంతో ఇప్పుడు గోపీచంద్ పేరు తెరపైకి వచ్చింది. యువికి గోపీచంద్ కు మాంచి సాన్నిహిత్యం వున్న సంగతి, అతగాడి కోసం ఇప్పుడు మారుతిని ఫిక్స్ చేసేస్తారేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అదే కనుక నిజం అయితే, అయ్యో మారుతి అనుకోవాలేమో? ప్రతి రోజూ పండగ లాంటి సూపర్ హిట్ ఇచ్చినా సరైన హీరో డేట్ లు దొరకడం లేదు అంటే ఏమనుకోవాలి? పైగా ప్రతి రోజు పండగ కు ముందు కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే లక్కీగా పెద్ద హిట్ కొట్టారు. మరి పెద్ద హిట్ కొట్టినా మళ్లీ అలాంటి పరిస్థితే అంటే ఎలా? మారుతి ఇది ఏదో విధంగా సెట్ చేయాల్సి వుంది. లేదూ తానే మొత్తం మోసుకుంటూ, సినిమాను గట్టెక్కించుకోవడం అన్నది ప్రతి సారీ సాధ్యం కానీ ఫీట్ అవుతుంది.