సీఎం ఇంటికి బాంబు బెదిరింపు..! ఫోన్ చేసింది ఆకతాయి కాదు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటిని బాంబుతో పేల్చేస్తామంటూ వచ్చిన ఓ ఫోన్ కాల్ తీవ్ర కలకలం రేపింది. అయితే.. పూర్తి విచారణలో ఈ ఫోన్ కాల్ చేసింది ఓ మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలియడంతో పోలీసులు ఉపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎగ్మూర్‌లో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు శుక్రవారం ఉదయం 10 గంటలకు.. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఇంట్లో బాంబు పెట్టామని.. కొద్దిసేపట్లో పేలబోతోందని ఓ వ్యక్తి ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే అలెర్టయిన పోలీసులు, బాంబు స్క్వాడ్‌, పోలీసు జాగిలాలతో సీఎం ఇంటికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

అయితే.. వచ్చింది ఫేక్‌ కాల్‌ అని నిర్ధారించి విచారణ చేపట్టారు. తేనాంపేట పోలీసుల.. సైబర్‌ క్రైం పోలీసుల సహకారంతో ఆ ఫోన్‌ విల్లుపురం జిల్లా మరక్కాణంకు చెందిన భువనేశ్వర్‌ అనే 26 ఏళ్ల యువకుడు చేసాడని నిర్ధారించారు. విచారణలో భువనేశ్వర్‌ కు మతిస్థిమితం లేదని తెలుసుకొని, అతడి తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరించి పంపారు. గతంలో భువనేశ్వర్‌ మాజీ సీఎం పళనిస్వామి, పుదుచ్చేరి సీఎం, సినీనటులు రజినీకాంత్‌, విజయ్‌, అజిత్‌ తదితరుల ఇళ్లలోనూ బాంబు పెట్టానని ఫోన్‌ చేసినట్టు పోలీసులు తెలుసుకున్నారు.