ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇటీవల కాలంలో చాలా సైలెంటుగా ఉంటున్నారు. గతంలో ఏ అంశం మీదనైనా ప్రతిపక్షాలపై అంతెత్తున విరుచుకుపడే ఆమె.. ఈ మధ్యన ఎక్కడా కనిపించడంలేదు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ ఎపిసోడ్ లో పలువురు మంత్రులు, వైసీపీ నేతలు నిమ్మగడ్డపై విరుచుకుపడినా.. రోజా మాత్రం పెదవి విప్పలేదు. కానీ తాజాగా ఆమె ఒక్కసారిగా ఫైరయ్యారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తాపై మండిపడ్డారు. జిల్లాలో అధికార పార్టీ నేతలే కాకుండా అధికారులు కూడా తనకు కనీస గౌరవం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రజాప్రతినిధులంటే కలెక్టర్ కు గౌరవం లేదని విమర్శించారు. ప్రోటోకాల్ ప్రకారం తనకు ఏ విషయంలోనూ సమాచారం ఇవ్వడంలేదన్నారు. తెర వెనుక ఎవరున్నా.. సమాచారం ఇవ్వాల్సిన కలెక్టర్ కు ఏమైందని ప్రశ్నించారు. నిజానికి చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజాకు తొలి నుంచి పార్టీ నేతలతో అంతగా పొసగడంలేదు. తొలుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పడకపోగా.. అనంతరం డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో విభేదాలు వచ్చాయి. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మంత్రులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆమె వాపోయారు.
వీటిని అధిష్టానం సర్దుబాటు చేసినా ఆమెలో అసంతృప్తి చల్లారలేదు. అందుకే మీడియాలో ఎక్కడా కనిపించడంలేదు. ఈ తరుణంలోనే కలెక్టర్ పై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు కూడా చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. కలెక్టర్ తీరుపై మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ ను బదిలీ చేయాలంటూ ఎస్ఈసీ ఆదేశించిన నేపథ్యంలోనే రోజా.. ఆయనపై ధ్వజమెత్తడం విశేషం.