తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఈరోజు గురువారం సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సీనియర్ హీరో చిరంజీవితో పాటుగా మహేష్ బాబు – ప్రభాస్ – రాజమౌళి – కొరటాల శివ – నిరంజన్ రెడ్డి – ఆర్ నారాయణ మూర్తి – అలీ – పోసాని కృష్ణ మురళి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే సీఎంఓ నుంచి ఆహ్వానం అందినవారే ఈ భేటీలో పాల్గొన్నారని వార్తలు వస్తున్నాయి.
అమరావతికి వెళ్ళడానికి బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చిన చిరంజీవి.. సీఎంఓ నుంచి తనకు మాత్రమే ఆహ్వానం అందిందని తెలిసిందని వ్యాఖ్యానించారు. దీంతో సీఎంఓ నుంచి పిలుపు వచ్చినవారే జగన్ తో సమావేశానికి వెళ్ళుండొచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే నిజమైతే టాలీవుడ్ సీనియర్ నటుడు నిర్మాత మంచు మోహన్ బాబు మరియు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు లకు ఆహ్వానం అందలేదా అనే కామెంట్స్ వస్తున్నాయి.
మంచు ఫ్యామిలీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బంధువులనే సంగతి తెలిసిందే. అందులోనూ ఇప్పుడు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెసిడెంట్ కూడా. ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారం కోసం జరిగే కీలక భేటీకి వారికి కూడా ఇన్విటేషన్ వస్తుందని అందరూ భావించారు. అయితే ఈరోజు సీఎంతో జరిగిన సమావేశంలో మంచు మోహన్ బాబు కానీ.. విష్ణు కానీ కనిపించలేదు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచు హీరోలకు ఆహ్వానం అందలేదా? లేక అందినా చిరంజీవి నేతృత్వంలో జరిగే మీటింగ్ అని దూరంగా ఉన్నారా? ఫిలిం ఛాంబర్ తరపున ఈ భేటీ జరగలేదని ఆలోచించారా? లేదా కోవిడ్ టైం అని సీఎంఓ కొందరినే ఇన్వైట్ చేసిందా? మరేవైనా కారణాలు ఉన్నాయా? అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని నెలలుగా సాగుతున్న సినిమా టికెట్ ధరల వ్యవహారంపై అటు మోహన్ బాబు కానీ.. ఇటు విష్ణు కానీ స్పందించలేదు.
‘మా’ అధ్యక్షుడుగా గెలిచిన తర్వాత మంచు విష్ణు ఇంతవరకు ఏపీ సీఎం జగన్ ని కలవలేదు. ఇటీవల జగన్ తో చిరంజీవి భేటీ గురించి మాట్లాడుతూ అది పర్సనల్ మీటింగ్ అని.. దానిని అసోసియేషన్ సమావేశంగా భావించకూడదని కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ క్రమంలో ఇవాళ జరిగిన సమావేశంలో కూడా మంచు హీరోలు లేరు. వాస్తవానికి జగన్ తో భేటీకి సీనియర్ నిర్మాతలు సురేష్ బాబు – దిల్ రాజు – అల్లు అరవింద్ వంటి అగ్ర నిర్మాతలతో పాటుగా సీఎంఓ లిస్టులో ఉన్న అక్కినేని నాగార్జున – జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్ళలేదు.
తమ ఫ్యామిలీ నుంచి చిరంజీవి వెళ్లారు కాబట్టి తాను కూడా వెళ్లాల్సిన అవసరం లేదని అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు. అక్కినేని అమలకు కరోనా పాజిటివ్ అని తేలడంతో నాగార్జున సీఎంతో సమావేశానికి దూరంగా ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక మంచు మోహన్ బాబు తోపాటుగా మిగతా సినీ పెద్దలు ఈ మీటింగ్ కు ఎందుకు వెళ్లలేదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.