రిలయన్స్ కరోనా సాయం… ఏపీకి రూ.5 కోట్లు

ప్రాణాంతక వైరస్ కరోనాపై పోరుకు దేశవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ విరాళాలు అటు కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ తో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రి సహాయ నిధులకు చేరుతున్నాయి. కార్పొరేట్ దిగ్గజాలతో పాటు చాలా మంది ప్రముఖులు పెద్ద ఎత్తున కరోనా కట్టడి కోసం విరాళాలు అందిస్తున్నారు.

ఈ క్రమంలో ఏపీకి ఓ ప్రత్యేక విరాళం అందింది. అదే రిలయన్స్ సంస్థ నుంచి అందిన రూ.5 కోట్ల సాయం. ఈ మేరకు మంగళవారం ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థ… ఏపీ సీఎంఆర్ఎఫ్ కు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ పద్దతిలో రూ.5 కోట్లను విరాళంగా అందజేసింది. ఆ వెంటనే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… రిలయన్స్ సాయానికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ కూడా రాశారు.

అయినా ఇందులో ప్రత్యేకత ఏముందంటారా? ఎందుకు లేదు? రిలయన్స్ సంస్థ పీఎం కేర్స్ కు ఏకంగా రూ.530 కోట్ల మేర భారీ విరాళాన్ని అందజేసింది. అయితే ప్రత్యేకించి ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రిలయన్స్ వేరుగా విరాళాన్ని ప్రకటించిన దాఖలా లేదు. ఈ నేపథ్యంలో రిలయన్స్ నుంచి ఏపీకి రూ.5 కోట్ల విరాళం అందిందంటే అది ప్రత్యేకమే కదా.

రిలయన్స్ నుంచి ఏపీకి అందిన ఈ ప్రత్యేక విరాళంలో జగన్ మార్కు ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే… దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా విరాళం ఇవ్వని రిలయన్స్… ప్రత్యేకించి ఏపీకి మాత్రమే వేరుగా రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించిందంటే… అది కూడా ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా విరాళం అందించిందంటే… అది జగన్ సాధించిన విరాళమనే చెప్పాలి కదా.

ఇటీవల తన సంస్థకు చెందిన ముఖ్యుడు పరిమళ్ నత్వానీని వెంటేసుకుని మరీ ముఖేశ్ అంబానీ… తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి జగన్ తో భేటీ అయ్యారు కదా. ఈ సందర్భంగా ఈ దఫా నత్వానీకి ఏపీ తరఫున రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని ముఖేశ్ కోరడం, అందుకు జగన్ సరేననడం, ఆ తర్వాత వైసీపీ అభ్యర్థిగానే నత్వానీ రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేయడం తెలిసిందే కదా.

అంటే తాను అడిగినంతనే.. తన సంస్థ ముఖ్యుడికి జగన్ రాజ్యసభ సీటిస్తే… దానిని మరిచిపోని ముఖేశ్… ఏకంగా ఏపీకి రూ.5 కోట్ల మేర భారీ కరోనా విరాళాన్ని అందజేశారు. అది కూడా ఏపీకి మాత్రమే ప్రత్యేకంగా ముఖేశ్ అంబానీ ఈ విరాళం అందజేశారు. మొత్తంగా జగన్ తనదైన మార్కుతో ఈ విరాళాన్ని సాదించారన్న మాట.