ప్రముఖ నటుడు, నిర్మాత మాగంటి మురళీ మోహన్ మళ్లీ సినిమారంగం వైపు దృష్టి సారిస్తున్నారు. ఎన్నో సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు పాత్రలు పోషించి పలువురి మన్ననలు అందుకున్న ఆయన.. సొంత బ్యానర్ జయభేరి ఆర్ట్స్ పై దాదాపు 25 సినిమాలు నిర్మించారు. అయితే, ఈ క్రమంలో రాజమండ్రి ఎంపీగా గెలుపొందడంతోపాటు వ్యాపార వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో దాదాపు పదేళ్లపాటు సినీరంగానికి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికిన మురళీమోహన్.. మళ్లీ సినిమాల వైపు దృష్టిసారించారు. త్వరలోనే జయభేరి ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు తీయనున్నట్టు ప్రకటించారు. అలాగే తన వయసుకు తగిన పాత్రలు వస్తే నటిస్తానని చెప్పారు.
ప్రస్తుతం ఆర్కా మీడియా నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు తమ సొంత బ్యానర్ పై 25 సినిమాలు తీశామని.. మహేశ్ బాబు నటించిన అతడు సినిమా చివరిదని వెల్లడించారు. ప్రస్తుతం తాను రాజకీయాల నుంచి వైదొలగడంతోపాటు వ్యాపార వ్యవహారాలను తమ్ముడు, పిల్లలకు అప్పగించానని.. ఇకపై తన దృష్టంతా సినిమాలేనని పేర్కొన్నారు. అయితే, చిన్న బడ్జెట్ సినిమాలా లేక పెద్ద బడ్జెట్టా? సినిమాలా.. వెబ్ సిరీస్ లా అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రేక్షకులు ఏది ఆదరిస్తారో అదే తీస్తానని ప్రకటించారు.