నాగశౌర్య కథానాయకుడిగా సంతోష్ దర్శకత్వంలో ‘లక్ష్య’ సినిమా రూపొందింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు.
ఈ నెల 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమాను గురించి నాగశౌర్య మాట్లాడాడు. “2019లో సునీల్ గారు నాకు ఈ కథను పంపించారు. సంతోష్ గారు వచ్చి నాకు ఈ కథను వినిపించాడు. ఆ పాత్రలో నన్ను చూసుకున్నాను .. ఈ సినిమా చేసేటప్పుడు నేను ఎంతో నేర్చుకున్నాను.
నేను ఎప్పుడూ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా నా నిర్మాతలు నన్ను చూసుకున్నారు. కాలభైరవగారు ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ను ఇచ్చారు. చాలామంది అడిగారు ఏంటి రెండు సాంగ్స్ మాత్రమే ఉన్నాయని.
‘అఖండ’లో రెండు సాంగ్స్ మాత్రమే ఉన్నాయి .. మా సినిమాలోను రెండు సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. కంటెంట్ ఉన్నప్పుడు ఎక్కువ సాంగ్స్ అవసరం లేదని ప్రూవ్ చేయడానికి వస్తోంది ‘లక్ష్య’. మా డైరెక్టర్ సంతోష్ గారు .. తను అనుకున్న విజన్ వచ్చేవరకూ తీస్తూనే ఉన్నారు .. చాలా బాగా తీశారు.
సంతోష్ కి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తున్నాను. మా కెమెరామెన్ రామ్ రెడ్డిగారు సినిమాను మరోస్థాయికి తీసుకుని వెళ్లారు. బాణం పట్టుకున్నప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఆయన పనిచేశాడు. ఆయన అంకితభావానికి నేను హ్యాట్సాఫ్ చెబుతున్నాను.
మా కేతిక ఈ సినిమాలోని తన పాత్రకి పర్ఫెక్ట్ గా అనిపించింది. ‘రొమాంటిక్’ చూసిన తరువాత నేను కూడా కేతిక శర్మకి ఫిదా అయిపోయాను. ఆమె వర్కింగ్ స్టైల్ వండర్ఫుల్ గా అనిపించింది. నా టీమ్ అంతా కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను.
ఈ సమయంలో శేఖర్ కమ్ముల గురించి మీకు ఒక మాట చెబుతాను. ఆయన ‘హ్యాపీడేస్’ సినిమా తీసిన తరువాత నేను ఆయన ఇల్లు ఎక్కడో తెలుసుకోవడం కోసం అదే పనిగా తిరిగేవాడిని. ఆయన పద్మారావు నగర్లో ఉండేవారు. నేను వెళ్లి ఆయన ఇంటిముందు బైక్ పై అటూ ఇటూ తిరిగేవాడిని. నన్ను చూస్తే చాలు ఛాన్స్ ఇస్తారు అనే ధీమాలో నేను ఉండేవాడిని.
ఆయన డాబాపై కూర్చుని ఏదో రాసుకుంటూ ఉండేవారు .. కానీ కనీసం నా వైపు చూసేవారు కూడా కాదు. ఆయన డైరెక్షన్ లో చేసే ఛాన్స్ ఎప్పుడు దొరుకుంతుందా అని నేను వెయిట్ చేస్తున్నాను. అలాగే శర్వానంద్ కాంబినేషన్లోను చేయాలనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.