కరోనా వైరస్ ప్రభావం వల్ల సినీ ఇండస్ట్రీ ఘోరంగా దెబ్బతింది. ముఖ్యంగా నిర్మాతలు దారుణంగా నష్టపోతున్నారు. ఇచ్చిన అడ్వాన్స్ లు లాకైపోయి, పెట్టిన పెట్టుబడి వెనక్కిరాక, వడ్డీలు పెరిగిపోయి నిర్మాతలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా తీయడమే దండగ అనుకుని నిర్మాతలు కూడా ప్రాజెక్టులను సైడ్ చేస్తున్నారు.
అయితే యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాత్రం ఇలాంటి పరిస్థితిలో కూడా దూసుకుపోతున్నాడు. దాదాపుగా 10 సినిమాలను ఈ యువ నిర్మాత ప్రస్తుతం నిర్మిస్తున్నాడు. నితిన్ హీరోగా రంగ్ దే సినిమా షూటింగ్ ప్రస్తుతం దశలో ఉంది. అలాగే నాగ శౌర్య హీరోగా కొత్త దర్శకురాలు సౌజన్య తెరకెక్కిస్తున్న సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు కాకుండా మలయాళ సినిమాలు అయ్యప్పనుమ్ కోషియుమ్, కప్పెలా చిత్రాలను కూడా కొనుగోలు చేసాడు. ఈ రెండు ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. నాని హీరోగా శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు నాగ వంశీ. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నరుడి బ్రతుకు నటన అనే ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టులు అన్నీ కాకుండా మారుతీ, శైలేష్ కొలను, కిషోర్ తిరుమల, గౌతమ్ తిన్ననూరి వంటి దర్శకులకు అడ్వాన్స్ లు ఇచ్చాడు. ఇలా వరస సినిమాలతో ఈ యువ నిర్మాత దూసుకుపోతున్నాడు.