పవన్ దొంగ అంటున్న‌ నాగబాబు!

మెగాస్టార్ చిరంజీవి ముగ్గురు అన్న‌ద‌మ్ముళ్ల మ‌ధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ప్ర‌జారాజ్యం పార్టీని చిరు కాంగ్రెస్‌లో విలీనం చేసిన త‌ర్వాత మ‌న‌స్తాపంతో కొంత కాలం పాటు ప‌వ‌న్ దూరంగా ఉంటూ వ‌చ్చాడు. మ‌రి ప్ర‌జారాజ్యం పార్టీని విలీనం చేసిన అన్న‌పైనో, లేక విలీనం చేసుకున్న కాంగ్రెస్ పార్టీపైనో తెలియ‌దు కానీ, మొత్తానికి 2014లో మాత్రం ఆ పార్టీకి వ్య‌తిరేకంగా ప‌వ‌న్ విస్తృతంగా ప్ర‌చారం చేశాడు.

అలాగే ఒక సినిమా ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్‌…ప‌వ‌న్ అని అభిమానుల‌ కేరింత‌లు, అదే స‌భా వేదిక‌పై ఉన్న నాగ‌బాబుకు కోపం తెప్పించాయి. “వాన్ని ప్ర‌తి ఫంక్ష‌న్‌కూ పిలుస్తూనే ఉన్నామ‌ని, వాడు రానందుకు మేము ఏం చేయాలి” అని ఆగ్ర‌హంతో నాగ‌బాబు ప్ర‌శ్నించ‌డం అంద‌రికీ తెలిసిందే. స‌రే, ఇవ‌న్నీ గ‌తం.

వ‌ర్త‌మానంలోకి వ‌స్తే అన్న‌ద‌మ్ముళ్లంతా క‌లిసిమెలిసి ఉన్నారు. జ‌న‌సేన త‌ర‌పున నాగ‌బాబు ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలో కూడా దిగిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతానికి వ‌స్తే రాజ‌కీయాల్లో పార్ట్ టైంగా, సినిమాల్లో ఫుల్‌టైంగా ప‌నిచేస్తున్న జన‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీమేక్ చిత్రం `వకీల్ సాబ్`తో రీఎంట్రీ చేయ‌నున్నారు. వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న సినిమాలో పవన్ నటించనున్నారు. ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు తాజాగా ప‌వ‌న్ సినిమాల‌పై అభిమానుల‌తో సోష‌ల్ మీడియాలో స‌ర‌దాగా ముచ్చ‌టించారు. పవన్-క్రిష్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమాకు `విరూపాక్ష` అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలిపాడు.

అలాగే సినిమాకు సంబంధించి మ‌రికొన్ని విష‌యాల‌ను నాగ‌బాబు పంచుకున్నాడు. ఈ సినిమా ఔరంగజేబు కాలానికి సంబంధించిన పీరియాడిక్ చిత్రమన్నాడు. ఈ సినిమాలో పవన్ దొంగ పాత్రలో కనిపించనున్నాడని అస‌లు విష‌యం వెల్లడించాడు. దీంతో హీరో కాస్తా దొంగ అవ‌తారంలో ఎలా మెప్పిస్తాడో అని అభిమానుల్లో ఉత్కంఠ నానాటికీ పెరుగుతోంది.