మన్మథుడు 2 ప్లాప్ తర్వాత నాగ్ కు సినిమాల ఎంపిక విషయంలో క్లారిటీ వచ్చింది. తన నుండి ఇక రొమాంటిక్ సినిమాలు ప్రేక్షకులు కోరుకోవట్లేదని అర్ధమైంది. అందుకే కొంత గ్యాప్ తీసుకుని తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం నాగ్ వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఊపిరికి రైటర్ గా పనిచేసిన సాల్మన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పరిస్థితులు చక్కబడే వరకూ ఎదురుచూడక తప్పదు. ఈ సినిమా పూర్తయ్యాక నాగ్ తన తర్వాతి చిత్రాన్ని కూడా లైన్లో పెట్టేసాడు.
విభిన్న చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో నాగార్జున పనిచేయనున్నాడు. ఇది కూడా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లోనే తెరకెక్కుతుంది. ఈ రెండు చిత్రాలు కాకుండా నాగార్జున ఎప్పటినుండో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రైడ్ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకుంటున్నాడు. రెండేళ్ల క్రితమే ఈ సినిమా రీమేక్ హక్కులను నాగ్ సొంతం చేసుకున్నాడు. తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ రీమేక్ ను తెరకెక్కించనున్నాడు. అయితే ఈ రీమేక్ ను సమర్ధవంతంగా తెరకెక్కించే దర్శకుడి కోసం నాగ్ ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఏదేమైనా వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. ప్రస్తుతం తెలుగు వెర్షన్ కు తగ్గట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతున్నాయట. రైడ్ రీమేక్ విషయంలో నాగ్ కు కంగారు లేదు. పెర్ఫెక్ట్ స్క్రిప్ట్ అండ్ దర్శకుడు ఎప్పుడు కుదిరితే అప్పుడే చేస్తా అంటున్నాడు.