చైతన్య కోసం నాగార్జున మెగా సెట్టింగ్‌?

అఖిల్‌ని స్టార్‌ని చేసేందుకు అతని రెండవ చిత్రం విషయంలో బడ్జెట్‌ పరిమితులు పెట్టని నాగార్జున ఇక చైతన్యని కూడా మిడిల్‌ రేంజ్‌ నుంచి స్టార్‌ని చేసే దిశగా పావులు కదుపుతున్నారని ఇండస్ట్రీ టాక్‌. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఇప్పటికీ ఇరవై కోట్ల మార్కెట్‌ దగ్గరే ఆగిపోయిన చైతన్యని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్లాలంటే స్టార్‌ డైరెక్టర్లతో సినిమాలు చేయాలని నాగ్‌ డిసైడయ్యారు.

గతంలో హీరో మార్కెట్‌కి అనుగుణంగా మాత్రమే సినిమాలు తీస్తూ వచ్చిన నాగార్జున కొడుకుల కోసం ఆ సూత్రాలు పక్కన పెట్టేసారట. చైతన్యతో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి నాగార్జున ప్లాన్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి త్రివిక్రమ్‌తో నాగ్‌ సంప్రదింపులు కూడా జరిపారట. ఎంత బడ్జెట్‌ కావాలో, ఎన్ని రోజుల్లో తీస్తారో అంతా మీ ఇష్టమని చెప్పారట. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఈ సినిమా చేయడానికి నాగార్జున ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ కాంబినేషన్‌ కానీ సెట్‌ అయితే హీరోయిన్‌గా సమంత నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. చై, సమంతల పెళ్లి నిశ్చయమైన తర్వాత వారిద్దరూ కలిసి నటించలేదు. త్రివిక్రమ్‌ దర్శకత్వానికి తోడు వాళ్లిద్దరూ తెరపై జంటగా కనిపిస్తే క్రేజ్‌ విపరీతంగా వుంటుంది. చైతన్య మార్కెట్‌కి బూస్ట్‌ వచ్చి నెక్స్‌ట్‌ రేంజ్‌కి వెళ్లి సెటిల్‌ అవ్వడానికి స్కోప్‌ పెరుగుతుంది.