సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న.!

టీడీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోమారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారిక నివాసానికి కూతవేటు దూరంలో ఓ యువతిపై సామూహిక అత్యాచార ఘటన జరగడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నారా లోకేష్.

‘జనం తిరగబడతారనే భయంతో రెండేళ్ళుగా తాడేపల్లి ప్యాలెస్ లో హోం ఐసోలేషన్ అయిన సీఎం జగన్ రెడ్డిగారూ.. మీ ప్యాలెస్ కి కూతవేటు దూరంలో ఒక యువతిని దుండగులు అత్యంత దారుణంగా అత్యాచారం చేశారనే సమాచారమైనా మీకు తెలుసా.? రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఓ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగితే ఏమయ్యారు.? సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయలేనోడు అన్న కాదు దున్న. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కంటే ముందొస్తాడు జగన్.. అంటూ పంచ్ డైలాగులేశారు.. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఇంత అన్యాయం జరిగితే ఏడమ్మా జగన్? అమరావతి ఉద్యమానికి భయపడి వేలమంది పోలీసుల్ని కాపలా పెట్టుకున్న పిరికి పంద జగన్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నారక్థమైంది..’ అంటూ లోకేష్ వేసిన ట్వీట్లు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి.

ముఖ్యమంత్రిని పట్టుకుని జుగుప్సాకరమైన భాషని లోకేష్ ప్రయోగించడమేంటి.? అంటూ వైసీపీ మద్దతుదారులు మండిపడుతున్నారు. ‘అయినా కర్ఫ్యూ అమల్లో వున్నప్పుడు, రాత్రి వేళ నదీ తీరంలో, ఇసుక తిన్నెల్లోకి ప్రియుడ్ని వెంటేసుకుని వెళ్ళడమేంటి.?’ అంటూ కొందరు వైసీపీ మద్దతుదారులు చేస్తోన్న కామెంట్ల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

అంటే, కర్ఫ్యూ సమయంలో ఏ పని మీదన్నా మహిళలు బయటకు వెళ్ళాల్సి వస్తే, అత్యాచారాలు చేయండని వైసీపీ ప్రోత్సహిస్తోందా.? అని టీడీపీ మద్దతుదారులు నిలదీస్తున్నారు.

ఒక్కటి మాత్రం నిజం.. తెలంగాణలో జరిగిన దిశ ఘటన పేరు చెప్పుకుని, రాష్ట్రంలో అధికార వైసీపీ బీభత్సమైన పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంది. దిశ పేరుతో వైసీపీ రంగుల్ని అధికారిక వాహనాలకు వేసేస్తోంది. దిశ పేరుతో అసెంబ్లీలో తీర్మానమైతే జరిగిందిగానీ, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. దాన్ని చట్టంగా మలచడంలో జగన్ సర్కారు శ్రద్ధ పెట్టలేకపోతోందన్న విమర్శలున్నాయి.

ఇదిలా వుంటే, చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైతే.. ఆ వివేకానందరెడ్డి కుమార్తె న్యాయం కోసం ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం.. అని ఆవేదన వ్యక్తం చేస్తోంటే, బాబాయ్ హత్య కేసుని ఎన్నికల కోసం వాడుకున్న వైఎస్ జగన్, ఎన్నికలయ్యాక ఆ కేసుని పట్టించుకోవడం మానేశారంటూ టీడీపీ విమర్శిస్తోన్న విషయం విదితమే.