ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరణించాడని అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా కిమ్ ఆరోగ్యం గురించిన వదంతుల గురించి తెలిసిన సంగతే. కిమ్ కు హార్ట్ సర్జరీ జరిగిందని, చికిత్స వైఫల్యంతో ఆయన బ్రెయిన్ డెడ్ స్టేజ్ కు చేరాడని కథనాలు వస్తున్నాయి. అయితే వాటిని నార్త్ కొరియా ధ్రువీకరించడం లేదు. అస్సలు కిమ్ ఆరోగ్యం గురించి ఆ స్టేట్ మీడియా చెప్పడం లేదని తెలుస్తోంది.
ఈ క్రమంలో అంతర్జాతీయంగా అయితే అనుమానాలు బలపడ్డాయి. కిమ్ ఆరోగ్యవంతంగా ఉంటే ఊహాగానాలను తెరదించేందుకు ఆయన స్పందించేవాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా స్పందించాడు. కిమ్ ఆరోగ్యవంతంగా ఉండాలని ఆయన ఆకాంక్షించాడు.
అయితే కిమ్ మరిలేరని, ఆయన చనిపోయాడని అంటున్నాయి కొన్ని అమెరికన్, జపనీస్ మీడియా వర్గాలు. నార్త్ కొరియాలో ఏం జరుగుతోందనే అంశం గురించి బాగా ఆలోచించే దేశాల్లో అమెరికా, సౌత్ కొరియా, చైనా, జపాన్ లు ముందుంటాయి. ఈ క్రమంలో అమెరికన్- జపనీస్ మీడియా వర్గాలు కిమ్ చనిపోయాడని అంటున్నాయి.
అయితే చైనా ఈ విషయం గురించి స్పందించడం లేదు. కిమ్ కు సపోర్టర్ అయిన చైనా.. ఆయన ఆరోగ్యం గురించిన వదంతుల నేపథ్యంలో ప్రత్యేక వైద్య బృందాన్ని నార్త్ కొరియాకు పంపిందట. బహుశా అసలు పరిస్థితి ఏమిటో నార్త్ కొరియన్ నియంతృత్వ ప్రభుత్వం చైనాకు సమాచారం ఇచ్చి ఉండొచ్చు. కిమ్ ఆరోగ్యం గురించి వదంతుల మాటెలా ఉన్నా, ఇప్పుడు ఆయన చనిపోయాడంటూ కొన్ని దేశాల మీడియా వర్గాలు ప్రకటించేస్తూ ఉన్నాయి. ఇంతకీ నార్త్ కొరియా ఎప్పుడు స్పందిస్తుందో!