నందమూరి బాలకృష్ణ 2004లో ఎంతో మనసుపడి మొదలుపెట్టిన చిత్రం నర్తనశాల. నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నటించిన అద్భుతమైన సినిమాల్లో నర్తనశాల ఒకటి. అలనాటి నర్తనశాలను మళ్ళీ తిరిగి అందించాలని బాలయ్య అనుకున్నారు. అర్జునుడిగా తాను, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబును ఎంచుకున్నారు. తానే స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించడం మొదలుపెట్టారు.
అయితే ద్రౌపదిగా నటిస్తోన్న సౌందర్య అర్ధాంతరంగా చనిపోవడంతో ఈ సినిమా అక్కడే నిలిచిపోయింది. సౌందర్య స్థానంలో వేరే హీరోయిన్ ను ఊహించుకోలేకపోయిన బాలయ్య మళ్ళీ ఈ సినిమాను టచ్ చేయలేదు. ఇప్పుడు దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ సినిమా కోసం షూట్ చేసిన సీన్స్ ను 17 నిమిషాల ఫుటేజ్ రూపంలో విడుదల చేస్తున్నారు. “అప్పుడు నటీనటుల కాల్ షీట్స్ ను 10 రోజుల కోసం తీసుకుని 5 రోజుల్లోనే పూర్తి చేశాను. మొత్తం కలిపితే దాదాపు 15 నిమిషాల ఫుటేజ్ ఉంటుంది. దీనికి అడిషనల్ గా మేము ఫిలప్ చేసాం. నాన్న గారు కనపడతారు. అయితే దానికి మేము ఏం చేశామన్నది ఆసక్తికరం. దసరాకు విడుదలవుతున్న ఈ అసంపూర్ణ చిత్రాన్ని విజయవంతం చేస్తే ఏమో, భవిష్యత్తులో నేను ఈ చిత్రాన్ని పూర్తి చేస్తానేమో.”
శ్రేయాస్ ఈటీలో ఈ చిత్రం విడుదలవుతోందన్న విషయం తెల్సిందే. ఈ 17 నిమిషాల ఫుటేజ్ ను చూడడానికి 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.