నిజమా.. ప్రభుదేవా, నయన్‌లు కలువబోతున్నారా?

ప్రభుదేవా, నయనతారలు ప్రేమించుకుని పెళ్లి వరకు వెళ్లారు. పెళ్లి కోసం నయనతార సినిమాలను కూడా వదిలేసేందుకు సిద్దం అయ్యింది. మతం మార్చుకోవడంతో పాటు ప్రభుదేవా భార్యతో సెటిల్‌మెంట్‌కు కూడా సిద్దం అయ్యింది. పెళ్లి పీఠల వరకు వచ్చిన తరుణంలో క్యాన్సిల్‌ అయ్యింది. ఎంతో ఆరాధించిన ప్రభుదేవాను నయన్‌ వదిలేసింది. మళ్లీ సినిమాలతో బిజీ అయ్యింది. కొంత కాలం తర్వాత విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో పడి జీవితంను సంతోషంగా సాగిస్తుంది.

ఈ ఏడాదిలో నయన్‌, విఘ్నేష్‌ శివన్‌ల వివాహం జరుగబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ప్రభుదేవా మరియు నయనతారల కాంబో మూవీ రాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో కార్తీ హీరోగా విశాల్‌ కీలక పాత్రలో ఒక సినిమా అనుకున్నారు. ఆ సినిమా క్యాన్సిల్‌ అవ్వడం జరిగింది. మళ్లీ ఇన్నాళ్లకు విశాల్‌ పాత్రను నయనతారతో రీప్లేస్‌ చేసి కథలో చిన్న చిన్న మార్పులు చేసి పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారట.

ప్రభుదేవా సినిమాలు చేయడమే చాలా ఎక్కువ. అలాంటిది తన మాజీ ప్రేయసి అయిన నయనతారతో సినిమా అంటే నిజం కాకపోవచ్చు అంటూ చాలా మంది అంటున్నారు. తమిళ సినీ వర్గాల వారు కూడా ఈ వార్తలు కేవలం పుకార్లు అయ్యి ఉంటాయని అంటున్నారు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఈ విషయమై చాలా ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. ప్రభుదేవా ఆసక్తిగా ఉన్నా నయన్‌ ఎలా ఈ సినిమాకు ఒప్పుకుంటుందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఏం జరుగబోతుందో తెలియాలంటే వేచి చూడాలి.