జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎన్నికల కమీషన్ సంచలన ఆదేశాలు

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్ధులుగా ప్రలోభాలు, బెదిరింపుల బారిన పడి నామినేషన్లు వేయనివారికి ఎన్నికల కమీషన్ మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశం ఇస్తామని ప్రకటించింది. ఈమేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సంచలన ఆదేశాలు జారీ చేసారు. ఈ నెల 20లోపు ఇటువంటి వ్యవహారాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ పేర్కొంది.

వీటిపై గతంలో రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదు పత్రాలను కూడా ఇవ్వాలని పేర్కొంది. ఫిర్యాదులు లేకపోతే మీడియా కథనాలతో కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఆయా రాజకీయపార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మాచర్ల, కడపలోని పులివెందుల, రాయచోటి, చిత్తూరులోని పుంగనూరు, పలమనేరు, తిరుపతి నగర పాలక సంస్థలో సింగిల్ నామినేషన్లపై అధికారులను రమేశ్ కుమార్ నివేదిక కోరారు.