అదేంటో, స్థానిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రెండో సీజన్ ప్రారంభమయ్యాక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి దెబ్బ మీద దెబ్బ పడుతోంది న్యాయస్థానాల్లో. చాలా విషయాల్లో ఎస్ఈసీ కి ఎదురు దెబ్బలు తగిలాయి, తగులుతూనే వున్నాయి. మాటలు తూలుతున్న మంత్రుల విషయంలో, ఓటర్లను బెదిరిస్తున్న అధికార పార్టీ నేతల విషయంలో ఎస్ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలకు న్యాయస్థానాల్లో చుక్కెదురయిన విషయం విదితమే. ఎస్ఈసీ వాదనల్లో పస లేకపోవడమే ఇందుకు కారణమా.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.
ఇదిలా వుంటే, తాజాగా మరోమారు ఎస్ఈసీకి రాష్ట్ర హైకోర్టులో షాక్ తగిలింది. పరిషత్ ఎన్నికలకు సంబంధించి గతంలో జరిగిన ఏకగ్రీవాలపై వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు, విచారణ చేపట్టి తగిన నిర్ణయం తీసుకోవాల్సి వుందని ఎస్ఈసీ అభిప్రాయపడితే, ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. అయితే, ఏకగ్రీవాలన్నిటినీ గుర్తిస్తూ డిక్లరేషన్ జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ని హైకోర్టు ఆదేశించింది. దాంతో, ఎస్ఈసీకి షాక్ తగిలినట్లయ్యింది.
బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయన్నది నిర్వివాదాంశం. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అదో పక్రియగా మారిపోయింది. అయితే, ఈ విషయంలో ఎస్ఈసీ తగిన వాదనలు న్యాయస్థానంలో వినిపించలేకపోయిందని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. మరోపక్క, పరిషత్ ఎన్నికలు ఎస్ఈసీ హయాంలో జరిగే అవకాశాలు దాదాపు శూన్యమే. ఎందుకంటే, ఆయన ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నెలాఖరు తర్వాత కొత్త ఎన్నికల కమిషనర్ రావాల్సి వుంటుంది. ఆ తర్వాతే పరిషత్ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది.
పంచాయితీ, మునిసిపల్ – కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ తన సత్తా చాటుకున్న దరిమిలా, పరిషత్ ఎన్నికల్లో విపక్షాల నుంచి పెద్దగా అద్భుతాలు ఆశించడానికి వీల్లేదేమో. పరిషత్ ఎన్నికల ప్రక్రియలోనూ బెదిరింపులు, బలవంతాలు, బ్లాక్మెయిలింగులూ మామూలే అవబోతున్నాయ్.