నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తెలుగునాట ఈ పేరు ఓ ప్రభంజనంలా మారిపోయింది. పత్రికల్లో బ్యానర్ హెడ్డింగులు, న్యూస్ ఛానళ్ళలో బ్రేకింగ్ న్యూసులు, చర్చా కార్యక్రమాలు.. అన్నీ ఈ పేరు చుట్టూనే తిరిగాయి కొద్ది నెలలపాటు. అధికార వైసీపీ చెప్పినట్టల్లా ఆడలేదన్నది నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద అధికార పార్టీ ఆరోపణ. విపక్షాల కనుసన్నల్లో ఆయన నడుస్తున్నారంటూ వైసీపీ చేసిన తీవ్ర ఆరోపణల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిమ్మగడ్డ వ్యవహరించిన తీరుపైనా చాలామందికి చాలా అనుమానాలున్నాయనుకోండి.. అది వేరే సంగతి.
టీడీపీ కార్యాలయంలో తయారు చేయబడిన ఫైల్స్ మీద ఆయన సంతకం చేశారంటూ పలు ఆరోపణలు అధికార పార్టీ చేసింది నిమ్మగడ్డ మీద గతంలో. మరిప్పుడు, పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఎక్కడ తయారైనట్లు.? వైసీపీ కేంద్ర కార్యాలయంలోనా.? అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నిన్న ఉదయమే నీలం సాహ్నీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రానికి పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. అంటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇంకా ఆ పదవిలో వుండగానే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం.. ఆయన ఆలోచనలకు భిన్నంగా.. వ్యవహారాలు చక్కబెట్టేసిందని అనుకోవాలా.? అని టీడీపీ సహా ఇతర రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
ఈ మాయాజాలం ఏంటి.? అన్నది అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. నిజానికి, ఎస్ఈసీ పదవి విషయమై పెద్దగా ఏమీ మారలేదు. అప్పుడు నిమ్మగడ్డ మీద వైసీపీ విమర్శలు చేస్తోంది.. ఇప్పుడు నీలం సాహ్నీ మీద విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అప్పుడూ, ఇప్పుడూ ముఖ్యమైన నిర్ణయాలు అనుమానాలకు తావిచ్చేలానే వున్నాయి. ఇప్పుడే ఇలా వుంటే, ముందు ముందు ఎస్ఈసీ నీలం సాహ్నీపై ఇంకెన్ని విమర్శలొస్తాయో.? అంతేనా ఇంకేమన్నా వుందా.! లేకనేం, చాలా వుంది. కోర్టు కేసులు వగైరాలు.. బోల్డంత రచ్చ జరగబోతోంది. నిమ్మగడ్డ తరహాలోనే నీలం సాహ్నీ గురించి కూడా నిత్యం మీడియాలో పగిలిపోయే వార్తలు.. చూడబోతున్నాం.