న్యూ ట్విస్ట్‌: ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నామన్న ఎస్‌ఈసీ

స్థానిక ఎన్నికల వివాదానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టత ఇచ్చింది. ‘ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే విషయంలో మేం నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరిపాం. కరోనా పరిస్థితుల గురించి వైద్య ఆరోగ్య శాఖ నుంచి సమాచారం సేకరించాం. నిబంధనలకు అనుగుణంగానే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడంలేదనడం సరికాదు. ఆ సంప్రదింపుల్ని బాధ్యతగా భావిస్తున్నాం. చీఫ్‌ సెక్రెటరీతోనూ సమావేశమవుతాం..’ అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.

19 పార్టీలకు సమాచారం అందించగా, 11 పార్టీలు వచ్చి తమ వాదనల్ని వినిపించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. కాగా, ఈ రోజు వివిధ రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ భేటీ అయిన విషయం విదితమే. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయమై ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కోరింది. వివిధ రాజకీయ పార్టీలు తమ తమ అభిప్రాయాల్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ముందుంచాయి. మెజార్టీ రాజకీయ పార్టీలు త్వరగా స్థానిక ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని కోరాయి. కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి సూచించాయి.

మరోపక్క, స్థానిక ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాలని మెజార్టీ పార్టీలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ని కోరడం గమనార్హం. కేంద్ర బలగాల సాయంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ సహా పలు పార్టీలు విజ్ఞప్తి చేశాయి. కరోనా లాక్‌డౌన్‌కి ముందు జరిగిన స్థానిక ఎన్నికల ప్రక్రియలో విధ్వంసాలు చోటు చేసుకున్నాయనీ, ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలతోనే ఎన్నికలు సజావుగా సాగుతాయనీ వివిధ రాజకీయ పార్టీలు చెబుతున్నాయి.

కాగా, ఈ రోజు ఎన్నికల కమిషన్‌తో సమావేశానికి వైసీపీ హాజరు కాలేదు. ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల ప్రక్రియను చేపట్టడం సబబు కాదు. ఏకపక్షంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తీసుకుంటున్న నిర్ణయాల్ని మేం స్వాగతించలేం..’ అంటూ వైసీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న విషయం విదితమే.