ప్రస్తుత పరిస్థితుల్లో మరో ఏడాది పాటు కొత్త పథకాలేవీ ప్రవేశపెట్టే ఉద్దేశం లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కొత్త పథకాల కోసం ఎటువంటి అభ్యర్థనలను పంపొద్దని అన్ని శాఖలకు ఇప్పటికే చెప్పామని నిర్మలా సీతారామన్ అన్నారు.
కేవలం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలకు మాత్రమే నిధులు కేటాయిస్తామన్నారు. ఈ రెండింటి పరిథిలోకి రాని ఏ ఖర్చునైనా ఆదాయ, వ్యయ విభాగం అనుమతి పొందాలని స్పష్టం చేశారు. బడ్జెట్ లో ఆమోదించిన పథకాలను వచ్చే మార్చి-31 వరకు నిలిపివేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
మరోపక్క భారత్ లో కోవిడ్-19 విజృంభిస్తోంది. ఇప్పటికే భారత్ లో 2లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల రేటులో 12వ స్థానం, యాక్టివ్ కేసుల్లో 5వ స్థానంలో భారత్ ఉంది. సుదీర్ఘ లాక్ డౌన్ వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోతలు విధిస్తున్నాయి. మన దగ్గర ఉన్న పరిమిత వనరులతోనే దేశాన్ని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి నెలకొంది అని ఆర్ధిక శాఖ మంత్రి అన్నారు. 11ఏళ్లల్లో జీడీపీ పెరుగుదల లేకపోవడం, భారత క్రెడిట్ రేటింగ్ తగ్గిపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆర్ధికవేత్తలు భావిస్తున్నారు.