కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జీఎస్టీ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు, ప్రజానీకానికి నవ్వు తెప్పిస్తున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్లు, మెడిసిన్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల వంటి వాటికి జీఎస్టీ నుంచి మినహాయింపునిస్తే ధరలు పెరిగిపోతాయని ఆమె సెలవిచ్చారు మరి. కరోనా వ్యాక్సిన్ ధర కేంద్రానికి ఒకలా.. రాష్ట్రానికి ఇంకొకలా, సాధారణ ప్రజలు కొనుక్కుంటే ఇంకోలా వుంటోన్న విషయం విదితమే. ఇదీ కేంద్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల వున్న చిత్తశుద్ధి. మరోపక్క, రెమిడిసివిర్ ధర బహిరంగ మార్కట్లో ఎంత వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.? ఏకంగా పది రెట్లు పెరిగిపోయింది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా ధరల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
నిన్న మొన్నటిదాకా 40 వేలకు దొరికిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇప్పుడు లక్ష రూపాయల వరకు ధర పలుకుతుండడం గమనార్హం. వైఫల్యం.. ఘోర వైఫల్యం.. ఇంకా ఏదన్నా పెద్ద పదం వుంటే అలాంటిది వాడాల్సి వుంటుంది.. కరోనా విషయంలో నరేంద్ర మోడీ సర్కార్ తీరుని ప్రస్తావించడానికి. కరోనా సోకితే ప్రాణం పోతుందా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, కరోనా పేషెంట్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే.. ఆ వ్యక్తి కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.. ఆ స్థాయిలో వైద్య చికిత్స కోసం ఖర్చవుతోంది.
ఇవన్నీ జీఎస్టీ వున్నప్పుడే జరుగుతున్నాయ్ నిర్మలమ్మగారూ.. అని ఆమెకెవరైనా చెబుతారో లేదో మరి. మన తెలుగింటి కోడలు.. కేంద్ర ఆర్థిక మంత్రి అయినందుకు తెలుగువారంతా గర్వపడ్డారు. కానీ, తెలుగు నేలకు నిర్మలమ్మ ప్రత్యేకంగా చేసిందేంటి.? పోనీ, దేశానికి నిర్మలమ్మ వల్ల ప్రయోజనం ఏమన్నా వుందా.?
మొన్నామధ్య.. అంటే కరోనా మొదటి వేవ్ సమయంలో.. వేల కోట్లు.. లక్షల కోట్లు.. దేశం కోసం వెచ్చించామని మోడీ సర్కార్ చెప్పుకుంది. పబ్లసిటీ తప్ప, ఆ ప్యాకేజీ వల్ల సామాన్యుడికేమైనా ప్రయోజనం కలిగిందా.? ప్యాకేజీ సంగతి పక్కన పెడదాం.. జీఎస్టీ మాఫీ చేస్తే రేట్లు పెరగడమేంటి.? వినడానికి వెర్రి వెంగళప్పల్లా వున్నారా దేశ ప్రజలు, నరేంద్ర మోడీ సర్కార్ దృష్టిలో?