నిర్మలమ్మ పద్దు.. ఇది ఏ రకమైన బడ్జెట్టు.?

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ప్రతిసారిలానే ఈ సారి బడ్జెట్ మీద కూడా సామాన్యుల్లో చాలా అంచనాలున్నాయి. అఫ్‌కోర్స్, అంచనాల్ని తల్లకిందులు చేసేలా బడ్జెట్ ప్రవేశ పెట్టడమనేది పాలకులకు అలవాటైపోయిందనుకోండి.. అది వేరే సంగతి. కోవిడ్ నేపథ్యంలో మధ్యతరగతి పాతాళానికి పడిపోయింది.. పేదలు మరింత పేదలైపోయారు. కేవలం కార్పొరేట్ శక్తులే పుంజుకున్నాయి పరమ రొటీన్‌గానే.

ఇంతకీ, నిర్మలమ్మ పద్దు ఎవర్ని ఉద్ధరించనుంది.? ఇంకెవర్ని ఉద్ధరిస్తుంది.. ఎలాంటి అనుమానాల్లేకుండా కార్పొరేట్లకు అనుకూలమైన బడ్జెట్టే వుండబోతోంది. పెట్టుబడుల ఉప సంహరణ ఎటూ కొనసాగుతుంది. తద్వారా నిధుల్ని సమీకరించడం అనేది పాలకులకు అలవాటైపోయింది. అలా సమీకరించిన నిధులు అటు తిరిగి, ఇటు తిరిగి కార్పొరేట్ల చేతుల్లోకే వెళుతున్నాయి తప్ప సామాన్యులకు ఉపయోగం లేకుండా పోతోంది.

ప్రతిసారీ లక్షల కోట్ల బడ్జెట్టు ప్రవేశ పెట్టేయడం, రక్షణ రంగాన్ని ఉద్ధరించేస్తున్నామనీ, వైద్య ఆరోగ్య రంగాన్ని బాగు చేసేస్తున్నామనీ.. ఇలా కాకమ్మ కథలు చెప్పడం పాలకులకు అలవాటే. అసలు సామాన్యులు, బడ్జెట్ మీద ఆశలు పెట్టుకోవడం ఎప్పుడో మానేశాడు. అయినాగానీ, కాస్తన్నా ఊరట దొరుకుతుందేమోనని ప్రతిసారీ కొంచెం ఆశగా ఎదురుచూసి, భంగపడుతూనే వున్నాడు.

ఉపాధి కల్పన అనే విషయాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ ఎప్పుడో మర్చిపోయింది. ఏటా లక్షలాది, కోట్లాది ఉద్యోగాల్ని కొత్తగా సృష్టిస్తామని చెప్పడమే తప్ప, కొత్తగా వచ్చే ఉద్యోగాలేమీ కనిపించడంలేదు. పైగా, ఉన్న ఉద్యోగాలు కాస్తా ఊడిపోతున్నాయి.

ఎంతలా అప్పులు చేస్తున్నా.. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేస్తున్నా.. దేశం ప్రగతి పథంలో పయనించలేకపోతోందంటే దానర్థమేంటి.? రాష్ట్రాలేమో, కేంద్రం తమను లెక్క చేయడంలేదని అంటున్నాయి. కేంద్రమేమో రాష్ట్రాల్ని ఉద్ధరించేస్తామంటోంది. ఏడున్నరేళ్ళలో పోలవరం ప్రాజెక్టుని (జాతీయ ప్రాజెక్టు కూడా) కేంద్రం పూర్తి చేయలేకపోయిందంటే.. మోడీ సర్కారు పాలన ఎంత గొప్పగా వుందో అర్థం చేసుకోవచ్చు.

బడ్జెట్టు.. కనికట్టు.. ఇది కార్పొరేటుకి తాకట్టు. అంతకు మించి ఏమన్నా కొత్తగా నిర్మలమ్మ ప్రవచనాలు చెప్పగలరా.?