చిరు, బాలయ్య అంటే అంత భయం మరి

గత కొన్నేళ్లుగా కొత్త సినిమా రిలీజ్ కాకుండా ఖాళీగా ఉన్న వీకెండే కనిపించట్లేదు. ఎంత బడా సినిమా వస్తున్నా సరే.. ముందు వారం, తర్వాతి వారం ఏదో ఒక సినిమా రిలీజ్ ఉండాల్సిందే. కానీ ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణల మధ్య మహా పోరు జరగనున్న నేపథ్యంలో ముందు వారం.. తర్వాతి వారం అసలు కొత్త రిలీజ్లే ఉండట్లేదు.

సంక్రాంతి సినిమాలు రిలీజయ్యాక వాటి టాక్ను బట్టి.. కలెక్షన్లను బట్టి తర్వాతి వీకెండ్లో ఏదైనా సినిమాను రిలీజ్ చేస్తారేమో తెలియదు కానీ.. ముందు వారం మాత్రం కొత్త సినిమాలేవీ లేవు. గత ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు బరిలో ఉన్నా సరే.. ముందు వారం రామ్ గోపాల్ వర్మ సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’ రిలీజైంది. మంచి వసూళ్లే సాధించింది.

కానీ ఈసారి మాత్రం సంక్రాంతికి ముందు వీకెండ్ ను ఖాళీగా వదిలేశారు. ఇది గత వారం రిలీజైన ‘అప్పట్లో ఒకడుండేవాడు’కు కలిసొచ్చే విషయమే. టాక్ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఈ సినిమాకు ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో రాలేదు. ఐతే పాజిటివ్ మౌత్ టాక్.. పబ్లిసిటీ పెరగడంతో కలెక్షన్లు పుంజుకున్నాయి. ఈ వారం కొత్త సినిమాలేవీ లేకపోవడంతో ఫస్ట్ వీకెండ్లో కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు.

రెండో వీకెండ్లో ఈ సినిమా లాభాల బాట పట్టే అవకాశముంది. చిన్న సినిమానే అయినప్పటికీ క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడలేదు. సినిమా స్థాయికి మించే ఖర్చు పెట్టాడు నిర్మాతలు. ఏడెనిమిది కోట్ల దాకా ఖర్చయిందని సమాచారం. ఐతే ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.15 కోట్ల దాకా వసూలు చేస్తుందని అంచనా.