చిరంజీవి సినిమా ఇంకా వెనక్కి

ఏప్రిల్‌లో మొదలవుతుందని అనుకున్న చిరంజీవి 151వ చిత్రం మరిన్ని రోజులు వాయిదా పడింది. ఈ చిత్రం ఆగస్టులో మొదలవుతుందంటూ నిర్మాత రామ్‌ చరణ్‌ ప్రకటించాడు. ఇంతకుముందు ఏప్రిల్‌లో స్టార్ట్‌ అవుతుందని చెప్పింది కూడా చరణే కనుక ఆగస్ట్‌ అనేది లేటెస్ట్‌ అప్‌డేట్‌ అనుకోవాలే కానీ ఫిక్స్‌డ్‌ డేట్‌ అనుకోవడానికి లేదు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథని సినిమాగా మలిచే ప్రయత్నంలో భాగంగా సినిమాకి అనుగుణమైన స్క్రీన్‌ప్లే కోసం రచయితలు పరుచూరి బ్రదర్స్‌, దర్శకుడు సురేందర్‌ రెడ్డి గత నాలుగు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. ఇంతవరకు సంతృప్తికరమైన స్క్రిప్ట్‌ రూపొందలేదని వచ్చిన వార్తలు నిజమేనని చరణ్‌ మాటలని బట్టి స్పష్టమవుతోంది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని డాక్యుమెంటరీలా కాకుండా కమర్షియల్‌ చిత్రంలా, అలా అని నేల విడిచి సాము చేయకుండా, సహజత్వానికి అద్దం పట్టేలా, చరిత్రని వక్రీకరించకుండా చేద్దామని చూస్తున్నారు. ఈ కారణంగానే రచనకి ఎక్కువ సమయం పడుతున్నట్టు సమాచారం.

ఇంతవరకు చిరంజీవి గెటప్‌ విషయంలో కూడా ఒక నిర్ణయానికి రాలేదని, విదేశీ మేకప్‌ నిపుణుల్ని పిలిపించి దానిపై వర్క్‌ చేయిస్తారని తెలిసింది.