ఎన్టీఆర్ పై అభిమానం.. వివాదానికి దారి తీసింది

ఇటీవలే ఎన్టీఆర్ తన పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ లాంటిదేం లభించలేదు. కాకపోతే యువ నటుడు విశ్వక్ సేన్ ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో పుట్టినరోజు నాడు మాస్ కా బాప్ పేరుతో ఒక వీడియోను విడుదల చేసాడు. తన సినిమా ఫలక్ నుమా దాస్ సినిమా కోసం సంగీత దర్శకుడు వివేక్ సాగర్ రూపొందించిన ర్యాప్ సాంగ్ ను ఈ పుట్టినరోజు వీడియో కోసం వాడుకున్నాడు విశ్వక్ సేన్.

ఈ వీడియో యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఖుషీ అయ్యారు. అయితే ఇప్పుడు దీని వల్ల విశ్వక్ సేన్ లీగల్ చిక్కుల్లో ఇరుక్కుంటున్నాడు. వివేక్ సాగర్ ఇలా తన వర్క్ ను వేరే వాటి కోసం వాడుకోవడం తనకు నచ్చలేదని ఇది తప్పని చెప్పి విమర్శించాడు. ఆ వీడియో కింద కామెంట్ కూడా పెట్టాడు. మర్యాదగా ఈ వీడియోను తొలగించాలని డిమాండ్ చేసాడు.

అయితే దీనిపై విశ్వక్ సేన్ స్పందించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియోను తొలగించే సమస్యే లేదని, అది తన సినిమా కోసం రూపొందించిన పాట అని, దానిపై సర్వహక్కులు తనకు ఉంటాయని, ఆ సాంగ్ ను ఎలాగైనా తాను ఉపయోగించుకుంటామని చెబుతున్నాడు. అసలే విశ్వక్ సేన్ కు వివాదాల హీరో అన్న పేరు వచ్చేసింది. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు కొత్త వివాదం మెడకు చుట్టుకుంది.

వివేక్ సాగర్ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేటట్లు కనిపించట్లేదు. తన పాటను ఇలా వాడుకున్నందుకు విశ్వక్ సేన్ పై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాడు. విశ్వక్ సేన్ కు లీగల్ నోటీసులు కూడా అందినట్లు తెలుస్తోంది. చూడాలి ఈ వివాదం ఎంత వరకూ వెళుతుందో.