ఎన్టీఆర్ సినిమాకు పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ అయినట్టేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉంది. వరస హిట్స్ తర్వాత ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో షూటింగ్ లకు అనుమతులు రావడంతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఈ నెలలోనే తిరిగి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అయినను పోయి రావాలె హస్తినకు అనే సినిమా చేయనున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది చివరికి ఈ చిత్రం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే దీని తర్వాత ఎన్టీఆర్, కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా “త్వరలోనే రేడియేషన్ సూట్ లో మిమ్మల్ని కలుస్తాను” అని ట్వీట్ చేయడంతో మూవీ దాదాపు కన్ఫర్మ్ అయింది. ఇక ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా మైత్రి మూవీస్ సంస్థ “మీరు రేడియేషన్ సూట్ వేసుకుని వస్తారని ఎదురుచూస్తున్నాం” అన్న తరహాలో ట్వీట్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్లే.

ఇక పై ట్వీట్లను బట్టి ఈ సినిమాకు రేడియేషన్ బ్యాక్ డ్రాప్ ఏదో ఉందని అందరూ ఫిక్స్ అయిపోయారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు న్యూక్లియర్ లేదా మిస్సైల్ అనే టైటిల్స్ ను మైత్రి సంస్థ కన్సిడర్ చేస్తోందని అంటున్నారు. ఈ రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేస్తారని సమాచారం. మరి ఈ రెండిట్లో ఏదైనా టైటిల్ అవుతుందా లేక ఇది జస్ట్ రూమరేనా అన్నది తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు.