ఎన్టీఆర్ బర్త్ డే.. డబుల్ ధమాకా

గత నెల రామ్ చరణ్ బర్త్‌డేకి ‘ఆర్ఆర్ఆర్’ టీం సడెన్ సర్ప్రైజ్ ఇచ్చేసింది. అతను చేస్తున్న సీతారామరాజు పాత్రకు సంబంధించిన ఇంట్రో వీడియోతో అభిమానుల్ని మురిపించింది. దానికి ఆ సినిమాలో మరో హీరో అయిన ఎన్టీఆర్‌తో ఇప్పించిన వాయిస్ ఓవర్ కూడా అదిరిపోయింది.

ఇక వచ్చే నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు అతను చేస్తున్న కొమరం భీమ్ పాత్ర తాలూకు ఇంట్రో వీడియో రావడం లాంఛనమే అనుకుంటున్నారు. దానికి చరణ్ వాయిస్ ఓవర్ ఉంటుందని కూడా ఫిక్సయిపోయారు.

రామరాజు టీజర్లో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఓ రేంజిలో ఉండటంతో దానికి దీటుగా తారక్ వీడియోను కూడా తీర్చిదిద్దే పనిలో రాజమౌళి టీం ఉన్నట్లు తెలుస్తోంది. తారక్ కూడా తన ఇంట్రో వీడియోలో బేర్ బాడీతో కనిపిస్తాడని.. పవర్ ఫుల్ షాట్లు ఉంటాయని అంటున్నారు.

ఐతే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి వీడియోతో పాటు తారక్ అభిమానులకు ఆ రోజు మరో ట్రీట్ కూడా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ చేయాల్సిన కొత్త సినిమా గురించి అదే రోజు ప్రకటన ఉంటుందని అంటున్నారు. ‘అరవింద సమేత’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ మరో సినిమా చేయబోతున్నట్లు ఇంతకుముందే సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. తన తర్వాతి సినిమా తారక్‌తోనే అని త్రివిక్రమ్ కూడా ఇంతకుముందే స్పష్టత ఇచ్చాడు.

ఈ చిత్రానికి ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు వార్తలొచ్చాయి. ఐతే మధ్యలో మారిన పరిణామాల నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ ఆలస్యం అవుతుండటంతో ఈలోపు త్రివిక్రమ్ వేరే సినిమా చేస్తాడన్న ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. ఐతే అలాంటిదేమీ లేదని.. ఏడాది చివర్లో ఈ చిత్రం మొదలవుతుందని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సినిమా అనౌన్స్ చేసి ఈ ప్రచారానికి తెరదింంచాలని భావిస్తున్నారట. కాబట్టి ఎన్టీఆర్ బర్త్‌డేకి అభిమానులకు డబుల్ ధమాకానే అన్నమాట.