పాత సినిమాలనే మళ్ళీ ఆడించనున్న థియేటర్లు

అక్టోబర్ 15 నుండి థియేటర్లు మళ్ళీ ఓపెన్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన విషయం తెల్సిందే. అయితే కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లలో సినిమాలను ప్రదర్శించాలని నిబంధన పెట్టారు. దీంతో పాటు అన్ని కోవిద్ నిబంధనలను, జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. అయితే తెలంగాణలో అక్టోబర్ 15 నుండే థియేటర్లు తెరుచుకోగా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దసరా నుండి కొన్ని జిల్లాల్లో, వచ్చే దీపావళి నుండి అన్ని చోట్లా థియేటర్లు పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి.

అయితే థియేటర్లు తెరుచుకోవడానికి అవకాశం ఇచ్చినా కానీ కొత్త సినిమాలు ఏవీ విడుదల కావట్లేదు కాబట్టి ఈ ఏడాది విడుదలైన పాత సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, భీష్మ, జాను, పలాస వంటి చిత్రాలను ప్రదర్శించనున్నారు. వీటి ద్వారా బిజినెస్ మోడల్ ఎలా పనిచేస్తుంది అన్నది తెలుసుకునే వెసులుబాటు ఉంది. అలాగే ఈ సమయంలో థియేటర్లు కలెక్షన్లు గురించి పట్టించుకోకుండా కోవిద్ సమయంలో ఎలా ప్రదర్శించాలి అన్నది తెలుసుకోవచ్చు. వచ్చే నెల రోజులు పాత సినిమాలే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మల్టిప్లెక్స్ లలో మాత్రం కొత్త హిందీ సినిమాలు, హాలీవుడ్ చిత్రాలను విడుదల చేయొచ్చు. నెమ్మదిగా తిరిగి పాత థియేటర్ బిజినెస్ లలోకి రావాలని థియేటర్ యాజమాన్యాలు భావిస్తున్నాయి.