ఏ సపోర్ట్ లేకుండా తన ప్రతిభతో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. కెరీర్ మొదట్లో సూపర్ హిట్లు సాధించిన ఈ కుర్రాడు సరైన సినిమాల ఎంపికలో తప్పులను చేసి ప్లాపులను కొనితెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా సరైన విజయం లేని ఈ హీరోకు ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవ్వడం చాలా అవసరం. రాజ్ తరుణ్ రీసెంట్ గా పూర్తి చేసిన చిత్రం ఒరేయ్ బుజ్జిగా. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టి తీరాలి. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ తరుణ్ కు అన్నీ వ్యతిరేకంగా మారుతుండడం దురదృష్టకరం.
ఒరేయ్ బుజ్జిగా మార్చ్ 25న విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా థియేటర్లు అన్నీ మూసివేయడంతో కుదర్లేదు. వచ్చే నెలలో థియేటర్లు తెరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది కానీ ఒకవేళ థియేటర్లు తెరుచుకుంటే ఉన్న నిబంధనల కారణంగా చిన్న సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఏ మేరకు ఆసక్తి చూపిస్తారన్నది డౌటే.
ఒరేయ్ బుజ్జిగాను విజయ్ కుమార్ కొండా తెరకెక్కించాడు. రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. హెబ్బా పటేల్, నరేష్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలు పోషించారు. కేకె రాధా మోహన్ ఈ చిత్రానికి నిర్మాత. ఓటిటిలో రిలీజ్ చేయమని భారీ ఆఫర్ వచ్చినా కానీ థియేటర్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత భావించాడు. మరి ఈ సినిమా విడుదలై రాజ్ తరుణ్ కెరీర్ కు భారీ హిట్ ను తెచ్చిపెడుతుందా అన్నది చూడాలి.