ఆ పవన్ హాహాకారాలు.. ఈ పవన్ కేరింతలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు విక్టరీ వెంకటేష్ మంచి మిత్రుడన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు చాలా బాగా చెబుతుంటారు. ఇద్దరూ కలిసి ‘గోపాల గోపాల’ సినిమాలోనూ నటించిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఆ ఇద్దరు మిత్రులు బాక్సాఫీస్ దగ్గర ప్రత్యర్థులుగా మారారు. తన మిత్రుడికి వెంకీ బాగానే గండికొడుతున్నాడిప్పుడు. ‘కాటమరాయుడు’ సంకట స్థితిలో ఉండగా రిలీజైన ‘గురు’ ఆ చిత్రానికి గట్టి పంచే ఇస్తోంది. ఫస్ట్ వీకెండ్ తర్వాత డల్ అయిన ‘కాటమరాయుడు’ ఉగాది రోజు మంచి వసూళ్లే తెచ్చుకున్నాడు. ఇదే ఊపును రెండో వీకెండ్లోనూ కొనసాగిద్దామనుకుంటే ‘గురు’ అడ్డం పడింది. ఆ సినిమా వల్ల ‘కాటమరాయుడు’ వసూళ్లపై బాగా ప్రభావం పడింది.

విశేషం ఏంటంటే.. ‘గురు’లో పనవ్ కళ్యాణ్ కూడా ఓ భాగం. ఈ చిత్రంలో హీరోయిన్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. పవన్ కటౌట్ చూసినా.. పోస్టర్ చూసినా ఊగిపోతుంది. సినిమాలో చాలా చోట్ల పవన్ రెఫరెన్సులు చూపిస్తారు. మామూలుగా ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో రెఫరెన్సులుండటం అరుదు. కానీ వెంకీ అలాంటి ఇగోస్ ఏమీ ఉండవు. పైగా ఆయనకు పవన్ మిత్రుడాయె. దీంతో పవన్‌ను బాగానే వాడేసుకున్నాడు. సినిమాలో పవన్ రెఫరెన్సులు కనిపించినపుడల్లా థియేటర్లు హోరెత్తిపోతున్నాయి. మరోవైపు పవన్ సినిమా ‘కాటమరాయుడు’ మాత్రం వెలవెలబోతోంది. మొత్తానికి పవన్‌ను రెఫరెన్సులున్న సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంటే.. పవన్ సినిమా ఇబ్బంది పడుతోంది.