ఆ భయమక్కర్లేదు కాటమరాయుడూ!

‘వీరమ్‌’ సినిమా రీమేకే కదా. వీరుడొక్కడే అంటూ తెలుగులో రిలీజ్‌ అయింది కదా. అది యూట్యూబ్‌లో వుందిగా, జీతెలుగులో తరచుగా వస్తూనే వుంటుందిగా, ఇక కాటమరాయుడులో ఏముంటుంది కొత్తగా? ఇదే వినిపిస్తోంది చాలా మంది నోట. ప్రత్యేకించి పవన్‌ని వ్యతిరేకించేవారు వీరుడొక్కడే పేరుతో ట్రోలింగ్‌ బలంగా చేస్తున్నారు.

పైకి గంభీరంగా కనిపిస్తున్నా ఫాన్స్‌కి కూడా ఈ విషయంలో బెంగగానే వుంది. అయితే ఫాన్స్‌కో గుడ్‌ న్యూస్‌. ‘వీరమ్‌’ సినిమా లైన్‌ని మాత్రమే తీసుకుని, కొన్ని ముఖ్య సన్నివేశాలని మాత్రం వాడుకుని మిగతాదంతా మార్చేసారట. ముఖ్యంగా ద్వితీయార్థం ఆ చిత్రానికి పూర్తి భిన్నంగా వుంటుందట. కాటమరాయుడు సెకండ్‌ హాఫ్‌ మొత్తం సరదాగా సాగుతుందని, కాటమరాయుడు తన ఐడెంటిటీ దాచిపెట్టి హీరోయిన్‌ ఇంటికి సామాన్యుడిలా వెళ్లిన దగ్గర్నుంచి కామెడీ బాగా పండిందని ఇన్‌సైడ్‌ టాక్‌.

పృధ్వీ క్యారెక్టర్‌తో మంచి ఫన్‌ పండిందని, తమిళ వెర్షన్‌తో సెకండ్‌ హాఫ్‌కి పోలికే వుండదని తెలిసింది. అదే నిజమైతే వీరుడొక్కడే రూపంలో కాటమరాయుడుకి జరిగే డ్యామేజ్‌ ఏమీ వుండదు. పవన్‌కి రీమేక్‌ సినిమాలు బాగానే కలిసి వచ్చాయి కనుక, అతని రీమేక్‌లు చాలా అరుదుగా మిస్‌ఫైర్‌ అయ్యాయి కనుక కాటమరాయుడు గురించి మరీ బెంగ పడాల్సిన పని లేదు. ఎంత తెలిసిన కథ అయినా కానీ తన స్టయిల్లోకి మార్చుకుని న్యూ లుక్‌ ఇవ్వడం పవన్‌కి అలవాటే కాబట్టి వీరుడొక్కడే ప్రభావం దీనిపై పడుతుందనే చింత అక్కర్లేదు.