చంద్రబాబు ప్రభుత్వానికి పవన్ డెడ్ లైన్

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ బాధితులను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ పరామర్శించారు. వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన పవన్ కల్యాణ్… ప్రభుత్వాల తీరును తప్పుపట్టారు.

వందల మంది చనిపోతున్నా ప్రభుత్వాలుఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇక్కడి పరిస్థితిపై పరిశోధన చేసి బాధితులను ఆదుకునేందుకు వంద కోట్లు కేటాయించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

వందల కోట్లు పెట్టి పుష్కరాలు చేసేందుకు డబ్బులు ఉంటాయి గానీ… ఇలాంటి బాధితుల కోసం డబ్బు ఉండదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

48 గంటలు సమయం ఇస్తున్నానని ఆ లోపు ఇక్కడ కిడ్నీ వ్యాధుల కారణంగా అనాథలైన పిల్లలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చేయబోతోందో చెప్పాలన్నారు.  15 రోజుల్లో తానే నేరుగా సీఎంను కలిసి పరిస్థితిని వివరిస్తానన్నారు.

నివేదిక సిద్ధం చేసేందుకు జనసేన తరపున ఒక కమిటీని కూడా పవన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా ఉద్యమం చేస్తానన్నారు. అయితే 48 గంటల్లోగా ప్రభుత్వం స్పందించాలని పవన్ డెడ్ లైన్ పెట్టారు. ఆ లోపు ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ స్పందించకపోతే పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇక్కడి పేదలకు దీర్ఘకాలంగా చికిత్సలు చేస్తున్న వైద్యులు కృష్ణమూర్తి, దుర్గా ప్రసాద్ లను సైతం కమిటీలో చేరాలని ఆహ్వానించారు. వీరు కమిటీతో పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి సలహా, సూచనలను ఇవ్వాలని జనసేన తరఫున కోరారు.

“ఈ రోజున ప్రతిదానికి ఆర్థిక పరమైన సమస్యే ఉంది. ప్రభుత్వాన్ని అడిగితే, నిధులు లేవంటారు. నేనీ రోజున రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను అడిగేంది ఏంటంటే, ఈ సమస్య ఓ విపత్తు. ఒక ప్రాంతంలో వేలాది మంది, దశాబ్దాలుగా చనిపోతున్నా ఏ ఒక్క ప్రజా ప్రతినిధి దృష్టికి ఎందుకు వెళ్లలేదు? ఒకవేళ వెళ్లినా, దీన్నెందుకు ముందుకు తీసుకెళ్లలేకపోయారు. మీరు దీనిపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఓట్లు వేయించుకున్నప్పుడు ప్రజల ముందుకు వచ్చి, సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో ఎందుకు వెనక్కు వెళ్లిపోతున్నారో అర్థం కావడం లేదు” అంటూ పవన్ విమర్శలు గుప్పించారు.