మళ్ళీ ఢిల్లీకి పవన్‌: అమిత్‌ షా ‘పిలుపు’ మేరకు.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మళ్ళీ ఢిల్లీకి వెళ్ళబోతున్నారట. ఈ మేరకు ఢిల్లీ నుంచి కబురొచ్చిందంటూ ‘లీకులు’ అందుతున్నాయి. గ్రేటర్‌ ఎన్నికల సమయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, జనసేన అధినేతతో మంతనాలు జరపడం, ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సూచన మేరకు జనసేన అధినేత ఢిల్లీకి వెళ్ళడం తెలిసిన విషయాలే.

అయితే, పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఆయనకు బీజేపీ అధినాయకత్వం సరైన గౌరవం ఇవ్వలేదనీ, జేపీ నడ్డాతో భేటీకి పవన్‌ ఎదురు చూడాల్సి వచ్చిందనే ప్రచారం జరిగింది. మరోపక్క, పవన్‌ ఢిల్లీ టూర్‌లో పలువురు బీజేపీ ముఖ్య నేతల్ని కలిశారనీ, ఆ భేటీలు కాస్తంత రహస్యంగా జరిగాయనీ జనసేన వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి.

ఇక, ఇప్పుడు జనసేన అధినేతకు ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి పిలుపు రావడం వెనుక తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికే కారణమనే చర్చ జరుగుతోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇప్పటికే ఖరారయ్యిందనీ, ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత ఢిల్లీకి వెళ్ళబోతున్నారనీ అంటున్నారు.

పోలవరం ప్రాజెక్టు సహా అనేక అంశాల గురించి ఢిల్లీ టూర్‌లో జనసేన అధినేత కేంద్ర హోంశాఖ మంత్రితో చర్చిస్తారట. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న అనేక పరిణామాల గురించీ ఈ టూర్‌లో ఢిల్లీ బీజేపీ పెద్దలతో పవన్‌ చర్చిస్తారని సమాచారం. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక విషయమై జనసేన – బీజేపీ మధ్య హాట్‌ హాట్‌ వాతావరణం నెలకొంది. తామే బరిలోకి దిగాలన్నది బీజేపీ వాదన.

అయితే, కలిసి కూర్చుని చర్చించుకుందాం.. అనే ప్రతిపాదన ఢిల్లీ నుంచే వచ్చింది. ఈ క్రమంలో ‘సమన్వయ లోపం’పై జనసేన అధినేత పవన్‌, బీజేపీ పెద్దలకు ఓ నివేదిక ఇవ్వనున్నారని తెలుస్తోంది. జమిలి ఎన్నికల వ్యవహారంపైనా పవన్‌, ఢిల్లీ టూర్‌లో చర్చిస్తారని సమాచారం. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతోపాటు, వీలైతే ప్రధాని మోడీని కూడా పవన్‌ ఈసారి ఢిల్లీ టూర్‌లో సమావేశమవబోతున్నారట. అయితే, ఇప్పటిదాకా పవన్‌ ఢిల్లీ టూర్‌పై జనసేన వర్గాల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.