పవన్ కళ్యాణ్ 300 కోట్లు.. ‘ప్యాకేజీ’ పైత్యానికి విరుగుడు ఇదే.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వరుస సినిమాలతో బిజీగా వున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు సినిమాలు లైన్లో వున్నాయి. వీటి ద్వారా పవన్ కళ్యాణ్ అందుకునే మొత్తం రెమ్యునరేషన్ దాదాపుగా 300 కోట్లు అని అంచనా వేసింది వైసీపీ అనుకూల మీడియా. కాదు కాదు, వైసీపీ నేతృత్వంలో నడుస్తోన్న పత్రిక, ఛానల్. కానీ, వైసీపీ మాత్రం పవన్ కళ్యాణ్‌ని రాజకీయంగా విమర్శించే క్రమంలో ‘చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్నారు..’ అని సుత్త వాగుడు వాగడం చూస్తున్నాం. ఇదెలా సాధ్యం.?

‘అక్కుపక్షిలో తప్పులు రాస్తారు అధ్యక్షా..’ అనుకోవాలా.? అంతేనేమో. తమ మీడియా విశ్వసనీయతాను తామే దెబ్బ తీసుకోవడంలో వైసీపాకి సాటి ఇంకెవరూ రారు. తమ వైఫల్యాలకు ‘కలరింగ్’ ఇచ్చే క్రమంలో తమ మీడియాని తప్పుడు మీడియాగా చిత్రీకరించుకోవడం వైసీపీకి కొత్తేమీ కాదు. ఆ విషయం ఇప్పుడు ఇంకోసారి నిరూపితమవుతోందని అనుకోవాలేమో.

రాజకీయంగా ప్రజల కోసం జనసేన అధినేత చేసే పోరాటాలు వైసీపీ అనుకూల మీడియాకి అస్సలు కనిపించవు. కానీ, పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన సినిమా వార్తల పట్ల మాత్రం సదరు వైసీపీ అనుకూల మీడియా ప్రత్యేకమైన ఆసక్తిని చూపిస్తుంటుంది. అత్యద్భుతంగా కథనాల్ని వండి వడ్డిస్తుంటుంది. పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్‌గా సాధించుకున్న పేరు ప్రఖ్యాతుల గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆయన రెమ్యునరేషన్.. టాలీవుడ్‌లోనే ఇంకే ఇతర హీరో తీసుకోనంత ఎక్కువ. అలాంటి వ్యక్తికి రాజకీయాల్లో ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం వుంటుందా.? కాస్తంత ఇంగితం వున్నవారికెవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. కానీ, ఇంగితం లేకపోవడమే రాజకీయం అయిపోయిందిప్పుడు. అందుకే, నోటికొచ్చినట్లు ప్యాకేజీ గురించి మాట్లాడతారు.

ప్యాకేజీలే నిజమైతే, వైసీపీనే అధికారంలో వుంది.. క్షణం ఆలస్యం చెయ్యకుండా, ఆ ప్యాకేజీ వ్యవహారాల గుట్టు రట్టు చేసేయొచ్చు. చెయ్యడంలేదంటే, తమ వాదనల్లో పస లేదని వైసీపీకి తెలుసన్నట్టే కదా.! పవన్ కళ్యాణ్.. ఆ పేరులో పవర్ వుంది. ఆ ‘పవర్’ 300 కోట్లు కాదు, అంతకు మించి. సినీ రంగంలో వచ్చే కోట్లు కాదనుకుని ప్రజా శ్రేయస్సు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ని ప్యాకేజీ పేరుతో విమర్శించడానికి సైతం ప్యాకేజీలు అందుకునే రాజకీయ నాయకులు.. ప్యాకేజీల గురించి మాట్లాడటం హాస్యాస్పదం కాక మరేమిటి.?