పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయాలు మార్పుకు సంకేతాలు: పవన్ కల్యాణ్

రాష్ట్రంలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన 23 శాతం ఓటింగ్ సాధించిందని అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో, అరకు వంటి ఏజెన్సీ ప్రాంతంలో పంచాయతీలను జనసేన కైవసం చేసుకోవడం విశేషమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం ములగాంపల్లి పంచాయతీని 24 ఏళ్ల యువకుడు జనసేన మద్దతుతో గెలవడం సంతోషంగా ఉందన్నారు. మొత్తంగా 270 పంచాయితీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు దక్కితే.. 1654 స్థానాల్లో జనసేన రెండో స్థానంలో నిలిచిందని అన్నారు.

పెడన నియోజకవర్గంలోని నీలిపూడి పంచాయతీలో స్థానిక ఎమ్మెల్యే హెచ్చరికలు ఖాతరు చేయకుండా ప్రజలు జనసేన మద్దతిచ్చిన అభ్యర్ధిని గెలిపించారని అన్నారు. ఇక్కడ పంచాయతీ మొత్తాన్ని జనసేన క్లీన్ స్వీప్ చేయడం విప్లవానికి సంకేతమని అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం నేలకుర్రు పంచాయతీ సర్పంచి విజయాన్ని రీకౌంటింగ్ పేరుతో అడ్డుకోవాలని చూస్తే జనసైనికులు, స్థానికులు ఐక్య పోరాటం చేయడం హర్షణీయమన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని వేకనూరు, పల్నాడులోని తక్కెళ్లపాడుతోపాటు రాయలసీమలోని కొన్ని సున్నితమైన ప్రాంతాలను జనసేన మద్దతుదారులు గెలుపొందడం ఆనందించే విషయమన్నారు.

రాజాంపేట నియోజకవర్గంలోని వీరబల్లి, అవనిగడ్డ ప్రాంతంలోని రామచంద్రాపురం పంచాయతీల్లో జనసేన మద్దతుదారులు గెలవడం సంతోషించే విషయం. పంచాయతీ ఎన్నికలంటే కాకలు తీరిన యోధులు ఉంటారు. కానీ.. నేడు నూనుగు మీసాల యువకులు కూడా విజయం సాధించడం ప్రజల్లో వస్తున్న మార్పుకు సంకేతాలు. మహిళలు సాధించిన విజయం కూడా వ్యవస్థల్లో మహిళలకు పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనాలు. ఈ సందర్భంగా జనసేన గెలుపుకు యువతీ యువకులు, మహిళలు చూపిన తెగువ, పోరాటాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని ఆయన అన్నారు.

2008లో నేను స్థాపించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు ప్రతిరూపమే జనసేన అని అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా ఆశయాలు, భావజాలం ఉన్న వ్యక్తులందరూ వ్యవస్థలోకి రావాలని ప్రారంభించిన నాటి సంకల్పం ఈరోజు కనిపిస్తోందన్నారు. జనసేనకు వస్తున్న మద్దతు మార్పుకు సంకేతమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

Share