‘అక్కడ తెలుగుదేశం పార్టీ ప్యాకేజ్.. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ప్యాకేజ్.. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవరికి మద్దతిస్తారో ఎవరికీ తెలియదు.. అసలు జనసేన పార్టీకి ఓ రాజకీయ సిద్ధాంతమే లేదు..’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ సీనియర్ నేత కృష్ణసాగర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద. అదేంటో, పవన్ కళ్యాణ్ మీద రాజకీయ విమర్శలు చేస్తే, తమ ఫాలోయింగ్ పెరుగుతుందని తెలంగాణ బీజేపీ నేతలు ఈ మధ్య ఒకింత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.
పైగా, మిత్రపక్షంపై విమర్శలు చేయడం వల్ల తమ బంధాన్ని బలహీనం చేసుకోవడంతోపాటు, పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నామన్న విషయాన్ని సదరు నేతలు మర్చిపోతున్నట్టున్నారు. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో జనసేన మీద ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ‘వెటకారం’తో కూడిన వ్యాఖ్యలు చేస్తే, సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి.. పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీజేపీ నేత డీకే అరుణ, జనసేనతో పొత్తు లేదని ప్రకటిస్తే, ఈసారి జనసేన.. సమయం చూసి బీజేపీని దెబ్బకొట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాల్సిన బీజేపీ ఓడిపోవాల్సి వచ్చింది. ఆ అక్కసుతోనే ఈసారి కృష్ణసాగర్ నోరు పారేసుకున్నారని తెలుస్తోంది. కానీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వుంది తెలంగాణలో.. అక్కడ బీజేపీ గెలవాలంటే, జనసేన మద్దతు తప్పనిసరి.
తిరుపతి ఉప ఎన్నిక వుంది.. పూర్తిగా జనసేననే నమ్మకుందిక్కడ బీజేపీ. ‘జనసేనతో మాకు పొత్తు లేదు..’ అని బీజేపీ అధినాయకత్వం ప్రకటించేస్తే.. ఎవరి దారి వారిది. కానీ, బీజేపీ జాతీయ నాయకత్వం, జనసేన పార్టీతో పొత్తు కోరుకుంటోంది. రాష్ట్రస్థాయి నేతలు కొందరు ఇదిగో ఇలాగే నోరు పారేసుకుంటూ, సొంత పార్టీకే వెన్నుపోటు పొడుస్తున్నారంటే, ఇతర పార్టీలతో ఆయా బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారనుకోవాలా.?