రేపు తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాస్సేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ఆడియో మెసేజ్ విడుదల చేశారు. కరోనాతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, ఆ కారణంగానే తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం కోసం రెండోసారి వెళ్ళలేకపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తిరుపతి ఓటర్లను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఆడియో మెసేజ్ విడుదల చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఆడియో మెసేజ్ ద్వారా తిరుపతి ఓటర్లకు ఓ స్పష్టమైన సూచన చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో జనసేన బలపరిచిన బీజేపీ అబ్యర్థి రత్నప్రభకు ఓటేసి గెలిపించాలని కోరారు పవన్ కళ్యాణ్. ప్రస్తుత ప్రభుత్వం, రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టేసిన వైనం, దేవాలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వ నిర్లక్ష్యం సహా అనేక అంశాల గురించి సవివరంగా ఈ ఆడియో మెసేజ్ ద్వారా పేర్కొన్నారు జనసేన అదినేత. అన్నటికీ మించి, నోటు కోసం ఓటును అమ్ముకోవద్దని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
పవిత్రమైన ఓటుని, నోటుకి అమ్ముకుంటే ప్రశ్నించే తత్వం కోల్పోతామనీ, అను నిత్యం ఇంట్లో పూజాధికాలు చేసే మనం, మనం పూజించే దేవళ్ళకు కొందరు అశుద్ధం పూస్తే, చూస్తూ మౌనంగా వుండటమేటని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. దేవాలయాలపై దాడులు జరుగుతోంటే, బాధ్యుల్ని శిక్షించలేని స్థితిలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ వుందనీ, పోలీసు వ్యవస్థ.. ప్రభుత్వ పెద్దలకు భయపడుతుండడంతోనే ఈ దుస్థితి దాపురించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
కరోనా కారణంగా వచ్చిన ఇబ్బంది నేపథ్యంలోనే తాను తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి ఇంకోసారి రాలేకపోయాననీ, అందుకే ఈ ఆడియో మెసేజ్ పంపుతున్నాననీ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. రెండ్రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డట్టు జనసేన పార్టీ తాజాగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేసిన విషయం విదితమే. ప్రస్తుతం జనసేన అధినేత తన సొంత వ్యవసాయ క్షేత్రంలో వైద్య చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుంది. పవన్ కళ్యాణ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.